గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(Gurmeet Ram Rahim). ఈ పేరుతో కంటే డేరాబాబాగా (Dera Baba)ఈయన సుపరిచితులు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు. డేరాబాబా రాసలీలలను వివరిస్తూ ఓ బాధితురాలు రాసిన లేఖ 15 ఏళ్ల తర్వాత మెడకు ఉచ్చు బిగించింది. ఇద్దరు భక్తురాళ్లపై అత్యాచారం కేసులో దోషిగా నిలబెట్టింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇటీవలే నాలుగ్గోడల మధ్య నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అయితే ఆయనకు మంజూరైన మూడు వారాల ప్రత్యేక సెలవు ముగిసింది. దీంతో పోలీసులు తిరిగి డేరాబాబాను సునారియా జైలుకు తరలించారు.
డేరాలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. బయటకొచ్చినా.. తనదైన స్టయిల్‌లో హాట్ టాపిక్ అయ్యారు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. ఎస్, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆయన ప్రత్యేక సెలవుపై రావడం వెనుక ఓ జాతీయ పార్టీ రాజకీయం ఉందనే విమర్శలు వచ్చాయి. డేరా బాబాకు హర్యానాలో మస్త్ ఫాలోవర్స్ ఉన్నా.. పంజాబ్‌లోని భటిండా, సంగ్రూర్, పాటియాలా, ముక్త్‌సర్‌లోను ఆయన అభిమానులు, అనుచరులు తక్కువేమీ కాదు. ఆయా ప్రాంతాల్లో ఈయన పరపతి ఎక్కువే. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఈయన్ను బయటకు తీసుకొచ్చారనే విమర్శలు వచ్చాయి.
వాటన్నిటినీ కొట్టిపారేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అయినా విమర్శనాస్త్రాలు ఆగలేదు. పైగా.. ఈయనకు Z-ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించడం మరో రచ్చకు దారి తీసింది. హత్యారోపణలు ఎదుర్కొని, అత్యాచారం కేసులో దోషిగా జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి Z-ప్లస్ సెక్యూరిటీ ఎందుకనే ప్రశ్నలు వినిపించాయి. ప్రాణహాని ఉందనే నివేదికల మేరకు భద్రత కల్పించామని పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఐదేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత వచ్చిన ప్రత్యేక సెలవు మూడు వారాలు ముగియడంతో.. గురుగ్రామ్ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య రోహ్‌తక్‌లోని సునారియా జైలుకు తరలించారు.
మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో డేరాబాబా ప్రభావం ఉంటుందా? ఇప్పుడీ చర్చ నడుస్తోంది. పంజాబ్‌లో రెండో విడత ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో డేరాబాబా ప్రత్యేక సెలవు, Z-ప్లస్ సెక్యూరిటీ, అంతే భద్రత మధ్య తిరిగి జైలుకు తరలించడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: నివాస ప్రాంతాలపై రష్యా మిసైళ్లు.. కీవ్‌ను విడిచి వెళ్లాలని హెచ్చరికలు