జన్‌పథ్‌లో ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో విపక్ష కూటమి చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈసీ కార్యాలయానికి మార్చ్‌గా బయల్దేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను జన్‌పథ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జన్‌పథ్‌లో ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
Congress Protest

Updated on: Oct 07, 2026 | 6:00 PM

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో విపక్ష కూటమి చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగించిన విపక్ష ఎంపీలు.. ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్‌ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే జన్‌పథ్‌ సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.సాగర్‌రత్న హోటల్‌ నుంచి మూడు బస్సుల్లో బయల్దేరిన విపక్ష కూటమి ఎంపీలు.. ఈసీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి కదిలేది లేదంటూ రాహుల్‌, ప్రియాంక భీష్మించారు.

ఈ సందర్భంగా పోలీసులకు, రాహుల్‌ గాంధీకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమను అక్కడి నుంచి కదిలించాలంటే దమ్ము చూపించాలంటూ రాహుల్‌ పోలీసులకు సవాల్‌ చేశారు. మరోవైపు పోలీసులు తనను కిందికి తోసేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాహుల్‌, ప్రియాంక వద్దకు పోలీసులు రాకుండా కాంగ్రెస్‌ ఎంపీలు, కార్యకర్తలు రక్షణ వలయంగా నిలిచారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలను వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు, కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జన్‌పథ్‌ ప్రాంతం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది.

భారీగా పోలీసు బలగాల మోహరింపు

నిన్నటి ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సెంట్రల్‌ ఢిల్లీలోని పలు ప్రధాన మార్గాలను మూసివేశారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

ఖర్గేతో లంచ్‌ మీట్‌ అనంతరం మార్చ్‌

ర్యాలీకి ముందు విపక్ష కూటమి ఎంపీలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో లంచ్‌ మీట్‌లో పాల్గొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన అనంతరం మూడు బస్సుల్లో ఈసీ కార్యాలయం వైపు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

సీఈసీ రాజీనామా చేసే వరకు ఆందోళనలు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విపక్ష కూటమి స్పష్టం చేస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని విమర్శించారు. ఈ అంశంపై వెనక్కి తగ్గేది లేదని విపక్ష కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us