జాతీయ జెండాతో 11 మందికే అనుమతి.. ఎవరూ రావొద్దు: ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన..

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టనున్న ‘లెహ్రా దో తిరంగ’ మార్చ్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకు సంబంధించి పోలీసులు పరిమిత అనుమతులు, ఆంక్షలు విధించారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, SIR రద్దు డిమాండ్లతో సీజేపీ చేపట్టనున్న ఈ కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది.

జాతీయ జెండాతో 11 మందికే అనుమతి.. ఎవరూ రావొద్దు: ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన..
Delhi Cjp Protest

Updated on: Oct 16, 2026 | 9:09 AM

దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కేంద్రంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమం.. లెహ్రా దో తిరంగ మార్చ్‌ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జంతర్‌మంతర్ అరెస్టులకు నిరసనగా శుక్రవారం సీజేపీ తిరంగ మార్చ్ కు పిలుపునివ్వగా.. కన్నాట్ ప్లేస్‌లో హై సెక్యూరిటీని మోహరించడంతోపాటు.. సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీజేపీ కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో సాయంత్రం 5 గంటలకు నిరసనలకు ప్లాన్ చేసింది.

అయితే.. నిరసనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చినప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పిలుపు మేరకు (అక్టోబర్ 16న) శుక్రవారం కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద సాయంత్రం జరగాల్సిన ఆందోళనకు సంబంధించి పోలీసులు కీలక షరతు విధించారు. పెద్ద ఎత్తున గుమిగూడేందుకు ఎటువంటి అనుమతి లేదని, కేవలం 11 మంది వ్యక్తులు మాత్రమే జాతీయ జెండాను పట్టుకుని, జాతీయగీతం ఆలపించడానికి వీలుగా ఆ చిన్న బృందానికి మాత్రమే అనుమతి ఇవ్వగలమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెండ్రోరోజుల పాటు సెంట్రల్ పార్క్‌ను పోలీసులు మూసివేశారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:

ఈ ఆందోళనలో సామాన్య ప్రజలు, కార్యకర్తలు ఎవరూ పెద్ద సంఖ్యలో పాల్గొనవద్దని, ఎవరూ అక్కడికి రావద్దంటూ ఢిల్లీ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ (Advisory) జారీ చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కన్నాట్ ప్లేస్‌లో ఈ నిరసనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఆందోళనను పూర్తిగా నిషేధించడానికి నిరాకరించింది. అయితే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, నియంత్రణ చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు హామీ ఇచ్చారు.

ఇప్పటికే పలువురు నేతల నిర్బంధాలు, నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధానిలో, పోలీసుల తాజా ఆంక్షలు, పరిమిత అనుమతుల నిబంధనల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us