Cyclone Yaas Update : సైక్లోన్ యాస్.. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది మరింత తీవ్రమై, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన చేరి పారదీప్ – సాగర్ ఐలాండ్స్ మధ్యలో 26వ తేదీన అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని ఢిల్లీలోని ఐఎండి పేర్కొంది. నైరుతి రుతుపవనాల వివరాలకొస్తే.. అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకుల వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు నిన్న (22.05.2021) నైరుతి బంగాళాఖాతము యొక్క మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, ఇంకా అండమాన్ నికోబార్ దీవులు యొక్క అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. ఇక, అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం యాస్ తుఫాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (22.05.2021) అల్పపీడనంగా కొనసాగి వాయుగుండంగా బలపడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి 24.05.2021 తేదీకి తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సుమారుగా 26వ తేదీ ఉదయంనకు ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుంది. 26.05.2021 తేదీ సాయంత్రమునకు ఇది పశ్చిమ బెంగాల్.. దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా – బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.