లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలను కైవసం చేసుకుంది. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు రావడంతో, ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అర్హత సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన స్థానాలు రానందున ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే జూన్ 8 శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాయ్ బరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడి హోదాను చేపట్టాలని ప్రతిపాదించారు ఆ పార్టీ నేతలు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి పాత్రను విజయవంతంగా చేపట్టాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది అత్యంత ముఖ్యమైన స్థాయిని కలిగి ఉంటుంది. నాయకులుగా ఎంపిక చేసి చట్టసభలకు పంపించిన ప్రజలకు ఎంతో బాధ్యతతో, జవాబుదారీ తనంతో మెలిగేందుకు ఇది దోహదపడుతుంది. అలాగే చట్టసభల్లో జరిగే ప్రతి చర్చను ప్రోత్సహించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది.
18వ లోక్‌సభ ప్రారంభమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ (LOP) నాయకుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అంటే లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకానికి అందరూ మద్దతు తెలిపారు. తద్వారా చట్టసభల్లో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక అంశాలపై సానుకూలతలు, విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుంది. అలాగే అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చేసే విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో సహాయపడుతుంది. దేశ పౌరుల ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతుకై స్వరాన్ని వినిపించాల్సి ఉంటుంది. పార్లమెంటరీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం, వాటి పర్యవేక్షణ, పాలనలో పారదర్శకత, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున 18వ లోక్‌సభలో రాహుల్‌గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా.. ప్రభుత్వాన్ని నిలదీసే అర్హతను కల్పించారు ఆ పార్టీ నేతలు. దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్(LOP)గా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీపై కోట్ల మంది ప్రజలు నమ్మకాన్ని కలిగి ఉన్నారని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయనను ప్రతిపక్షపార్టీ నేతగా నియమించాలని సూచించారు. దీనిపై శశి థరూర్, డికె శివకుమార్‌తో సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ పేరును ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన ప్రచారం, కృషిని “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” గా కొనియాడారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్‌పర్సన్‌గా ఈ నాయకుల ప్రతిపాదనను సోనియా ఓకే చేయాలి. అంతిమంగా సోనియా గాంధీ నిర్ణయంపైనే ప్రతిపక్ష నాయకుడి హోదా పొందే అవకాశం లభిస్తుంది. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎంపికపై చర్చలు జరుగుతున్న సమయంలోనే, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కొనసాగాలని భావిస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎంపీ రాహుల్ గాంధీని ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా పేర్కొన్నారు. అలప్పుజా నుండి కొత్తగా ఎన్నికైన ఎంపి కెసి వేణుగోపాల్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను రాహుల్ గాంధీని తీసుకోవాలని సిడబ్ల్యుసి ఏకగ్రీవంగా అభ్యర్థించిందని పలువురు నాయకులు స్పష్టం చేశారు.
#WATCH | Delhi: After the Congress CWC meeting, Jharkhand Congress chief Rajesh Thakur says, “Rahul Gandhi should be made the LOP as he has travelled 11,000 km and heard the problems of the public…25 guarantees have been given through the ‘Nyay Patra’…We are hopeful that… pic.twitter.com/6lwc0Wbf9k
— ANI (@ANI) June 8, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..