చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు 24 గంట్లో నాలుగు సార్లు ఆహ్వానించాం అంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్ని గంటలైనా తాము చర్చించేందుకు రెడీ ఉన్నామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Jitendra Singh

Updated on: Jul 23, 2026 | 6:17 PM

ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు చర్చల కోసం నాలుగు సార్లు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా, రోజులో ఏ గంటలోనైనా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఎంతసేపైనా సమావేశం నిర్వహించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆందోళనకు కారణమైన ప్రధాన అంశంతో పాటు, దానికి సంబంధించిన అన్ని ఇతర అంశాలపైనా ప్రభుత్వం స్వేచ్ఛగా చర్చించడానికి సిద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరస్పర చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశాలను సానుకూల, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. అవసరమైతే నడ్డా నివాసంలో గానీ, ఆయన కార్యాలయంలో గానీ, విద్యార్థి ప్రతినిధులకు అనుకూలమైన ప్రదేశంలో గానీ చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

‘ఈ సమావేశాలకు నేను కూడా తప్పకుండా హాజరవుతాను. విద్యార్థుల అభిప్రాయాలను పూర్తిగా వినేందుకు, వారి సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచిందని, విద్యార్థి ప్రతినిధులు ముందుకు వచ్చి సంభాషణ ప్రారంభించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us