Bullet Train: దేశంలో తొలి బులెట్ ట్రైన్‌ వచ్చేది అప్పుడే.. ఎక్కడో తెలుసా.?

ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌ పేరుతో అధికారులు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు అవసరమైన బ్రిడ్జిలను దాదాపు పూర్తి చేశారు. ఇక తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుల్లెట్‌ రైలు సర్వీసుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు...

Bullet Train: దేశంలో తొలి బులెట్ ట్రైన్‌ వచ్చేది అప్పుడే.. ఎక్కడో తెలుసా.?
Representative Image

Updated on: Jan 11, 2024 | 6:02 PM

భారత రైల్వే ముఖచిత్రం మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వందే భారత్‌ రైళ్లతో ఇండియన్‌ రైల్వే రూపురేఖలు మారగా ఇప్పుడు బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌ పేరుతో అధికారులు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు అవసరమైన బ్రిడ్జిలను దాదాపు పూర్తి చేశారు. ఇక తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుల్లెట్‌ రైలు సర్వీసుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి భారత్‌తో మొదటి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి గురువారం తెలిపారు.

వైబ్రెంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో మంత్రి మాట్లాడుతూ.. బుల్లెట్‌ రైలు కోసం 270 కిలోమీటర్ల పని పూర్తయిందని తెలిపారు. గుజరాత్‌, మహారాష్ట్ర, దాద్రా, నగర్‌ హవేలీలలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి 100 శాతం భూసేకరణ పూర్తి చేసినట్లు నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ తెలిపింది. ప్రాజెక్ట్ కోసం అవసరమైన మొత్తం 1389.49 హెక్టార్ల భూమిని సేకరించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్వీట్..

ఇదిలా ఉంటే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలని జరోలి గ్రామం సమీపం 350 మీటర్ల పొడవు, 12.6 మీటర్ల వ్యాసం కలిగి మొదటి పర్వ సొరంగాన్ని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హై స్పీడ్‌ రైలు మార్గాన్ని జపాన్‌కు చెందిన షింకన్‌సెన్‌ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్నారు. ఇందుకోసం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ రూ. 88,000 కోట్ల రుణం అందించింది. మొత్తం రూ. 1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత 2022 నాటికి పూర్తి చేయాలని భావించారు. అయితే భూసేకరణలో ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..