Common Man Budget News 2021: ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంబ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ ప్రజలందరి దృష్టి బడ్జెట్‌పై పడింది. ముఖ్యంగా దేశంలోని సామాన్య ప్రజలు దీనిపై ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వాలు సాధారణంగానే తీసుకుంటాయి.
ఈ నేపథ్యంలోనే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందనే దానిపై ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. అసలే కరోనాతో అతలాకుతలం అయిన జనజీవనానికి కేంద్రం ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పన్నుల నుంచి మినహాయింపులు, రుణాలపై వడ్డీ తగ్గింపు, ధరల తగ్గింపు వంటి అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆలోచనలో పడ్డారు సామాన్య ప్రజలు.
గతేడాది బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట కలిగించేలా సెక్షన్ 80 కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. మరి ఈ సారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని పెంచినట్లైయితే మధ్యతరగతి ప్రజలకు పెద్ద ప్రయోజనం కలుగనుందని ఎస్కార్ట్ సెక్యూరిటీ పరిశోధన విభాగాధిపతి ఆసిఫ్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల గృహ రుణాలు, ఇన్స్‌రెన్స్ టర్మ్ పాలసీలు తీసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. అదే సమయంలో ఇఫిఎఫ్, పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో డిమాండ్ కూడా..
ఇదిలాఉంటే పన్ను చెల్లింపు మరో డిమాండ్ కూడా వినిపిస్తోంది. సెక్షన్ 80 టీటీఏ కింద పరిమితిని రూ. 30,000 లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీఏ ప్రకారం బ్యాంక్/కో ఆపరేటీవ్ సొసైటీ/పోస్టాఫీసు పొదుపు ఖాతాల అంశంలో 60 ఏళ్ల లోపు వ్యక్తి, అవిభాజ్య కుటుంబం యొక్క డిపాజిట్లపై రూ. 10,000 వరకు మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ. 30,000 లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
80సి అంటే ఏంటి..?
ఇక ట్యాక్స్‌ల రూపంలో కష్టార్జితం కోల్పోకుండా ఉండేందుకు ఆదాయపు పన్ను చట్టంలో అనేక మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా పన్ను మినహాయింపు పొంది మన డబ్బును సేవ్ చేసుకోవచ్చు. వాటిలో సెక్షన్ 80 సి చాలా ముఖ్యమైనది. అసలు ఈ 80 సి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పన్ను చెల్లింపుదారులకు ఈ 80సి చాలా ఉపయోగకరం. సెక్షన్ 80 సీ కింద చేసే ఇన్వెస్ట్‌మెంట్లపై పన్నుచెల్లింపు దారుడు పన్ను మినహాయింపును పొందవచ్చు. కొన్ని ప్రత్యేక ఎంపికలు, పెట్టుబడిపై మాత్రమే సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు యొక్క ప్రయోజనం లభిస్తుంది. ఈ ఎంపికలలో ఇపిఎఫ్, విపిఎఫ్, పిపిఎఫ్, ఇఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, టాక్స్ సేవింగ్స్ ఎఫ్‌డి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్, ఎన్‌పిఎస్, ఎన్‌ఎస్‌సి, ఎస్సిఎస్ఎస్, నాబార్డ్ బాండ్ మరియు కొన్ని ఇతర పథకాలు ఉన్నాయి.
ప్రతి అర్హత గల ఎంపికకు దాని స్వంత పెట్టుబడి పరిమితి ఉంటుంది. వడ్డీ రేటు, ద్రవ్యత మరియు రాబడిపై పన్ను కూడా భిన్నంగా ఉంటాయి. ఇక జీవిత బీమా, గృహ రుణాలు, పిల్లల ట్యూషన్ ఫీజులు కూడా సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో తగ్గింపును క్లెయిమ్ చేయడానికి అదే సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం లేదా ఖర్చు చేయడం అవసరం. ఈ ఖర్చు లేదా పెట్టుబడి 1,50,000 రూపాయల వరకు ఉంటుంది.
Also read: