Arvind Kejriwal vs Kashmir Files ఒక్క సినిమా దేశంలో పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి వెళ్లేవరకు ఉసిగొల్పింది. అదే కశ్మీర్ ఫైల్స్ సినిమా.. జమ్మూకశ్మీర్ లోయలోని పండిట్‌ల గాథపై కశ్మీర్‌ఫైల్స్ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అందరూ సమర్థించారు. కానీ, కొందరు ముఖ్యమంత్రులు మాత్రం, దీన్ని రాజకీయ అస్త్రంగా అభివర్ణించి, కీలక కామెంట్స్ చేశారు. వారిలో కొందరు బీజేపీ ఆయుధాలుగా మారితే, మరికొందరు చిక్కకుండా, దొరక్కుండా కామెంట్స్ చేశారు. వారిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకరు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో ఈ సినిమా అంశం చర్చకు వచ్చింది. కశ్మీర్‌ఫైల్స్ సినిమాకు రాయితీలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దానికి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. సినిమాకు రాయితీలు ఎందుకు? దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే, అందరూ చూస్తారు కదా అని తనదైన స్టైల్‌లో పంచ్ కౌంటర్ ఇచ్చారు.
అప్పటినుంచి, కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా, తాజాగా ఆయన నివాసాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ముఖ్యమంత్రి నివాసం ముందు ఉండే బారికేడ్లను ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు. ఇంట్లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కాగా.. కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించడంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించలేని భారతీయ జనతా పార్టీ, ఆయనను చంపాలని కుట్ర చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీ వారికి పోలీసులే సహకరించారని సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తామంటూ పేర్కొన్నారు.
కాగా.. కేజ్రీవాల్ ఇంటిపై దాడిని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖండించారు. పంజాబ్ లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక బీజేపీ దాడులకు దిగుతుందంటూ విమర్శించారు. బీజేపీ కార్యకర్తల తీరుపై ప్రతిపక్ష పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి చర్యలు బీజేపీ నేతల్లో భయాన్ని తెలియజేస్తున్నాయని విమర్శిస్తున్నాయి.
Also Read: