
న్యూఢిల్లీ: పొరుగు దేశం భూటాన్‌లో హిమానీనద సరస్సు కరిగిపోతుంది. దీంతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో వరద ముప్పు ఆందోళన కలిగిస్తోంది. భూటాన్‌లోని షింటాఫు సరస్సు వద్ద చోటుచేసుకున్న పరిణామంతో సంకోష్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సలహా జారీ చేసింది.
భూటాన్‌లోని గాసా జిల్లా, లుంగో ప్రాంతంలోని లయా గెవాగ్ పరిధిలో వాకిలా పర్వతం దిగువన ఉన్న షింటాఫు సరస్సు వద్ద గురువారం (అక్టోబర్ 29) ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. ప్రమాద సూచనల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూటాన్‌లో ప్రమాదకరమైనవిగా గుర్తించిన 17 హిమానీనద సరస్సుల్లో షింటాఫు సరస్సు కూడా ఒకటి కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఏమిటీ GLOF ప్రమాదం?
హిమానీనదాలు కరిగిపోవడంతో ఏర్పడిన సరస్సుల్లో భారీగా నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని అడ్డుకునే సహజ ఆనకట్టలు బలహీనపడటం లేదా తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. దీనినే గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు. ఈ వరద ప్రవాహం పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. షింటాఫు సరస్సు పునాత్సాంగ్‌చు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సంకోష్ నదిగా పిలుస్తారు. అందువల్ల సరస్సు నుంచి భారీగా నీరు విడుదలైతే దిగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.
ఆరు నుంచి ఎనిమిది గంటల్లో భారత్‌కు వరద నీరు!
భారత ప్రభుత్వ హెచ్చరికల ప్రకారం ఆరు నుంచి ఎనిమిది గంటల్లో వరద నీరు భారత్-భూటాన్ సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, జల్‌పాయిగురి, డార్జిలింగ్ కొండ ప్రాంతాలతో పాటు అస్సాంలోని ధుబ్రి జిల్లాకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. కూచ్‌బెహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్, బక్షిర్‌హాట్ ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి
పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, కుమార్‌గ్రామ్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ఓరాన్ సంకోష్ నది పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కుమార్‌గ్రామ్ ప్రాంతంలో నది నీటిమట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వీడియో సందేశం ద్వారా హెచ్చరించారు. అధికారులకు సహకరించాలని, నది ఒడ్డున ఉండవద్దని సూచించారు.
మరోవైపు, భూటాన్ జాతీయ జలవిజ్ఞాన, వాతావరణ కేంద్రం (NCHM) అధికారులు తక్త్సిమఖాంగ్ వద్ద నీటిమట్టాన్ని పర్యవేక్షించే కేంద్రం ఉందని తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం అందిన సమయంలో అధికారిక హెచ్చరిక జారీ చేయలేదని వెల్లడించారు. సరస్సు నుంచి ఎంత పరిమాణంలో నీరు బయటకు వచ్చిందనే విషయం, దిగువ ప్రాంతాలపై దాని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, అధికారుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..