Bhupendra Patel: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ వర్గానికి చెందిన నేత భూపేంద్ర పటేల్. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. విజయ్ రూపానీ స్థానాన్ని భూపేంద్రతో భర్తీ చేసింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో పటేల్‌ను శాసనపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. త్వరలో ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
దీంతో గుజరాత్ లో నిన్నటి నుంచి నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లైంది. గాంధీనగర్‌లో ఇవాళ జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో భూపేంద్ర పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించారు. పార్టీ అధిష్ఠానం పంపించిన పరిశీలకులు.. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. కాగా, గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గుజరాత్లో నిన్నటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. రూపానీ వారసుడెవరు? సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు? అని సర్వత్రా చర్చలు జరిగాయి. దీనికి ముగింపు పలుకుతూ భూపేంద్ర పటేల్‌ను తదుపరి సీఎంగా ప్రకటించింది బీజేపీ. 55ఏళ్ల భూపేంద్ర.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.