కోవిద్ లాక్ డౌన్ సమయంలో బద్రీనాథ్ ఆలయానికి మీరు రావడమేమిటని సాక్షాత్తూ మంత్రి ధన్ సింగ్ రావత్ పైన, ఇతర బీజేపీ నేతలపైన బద్రీనాథ్ ఆలయ పూజారులు మండిపడ్డారు. ఇది లాక్ డౌన్ ప్రోటోకాల్ ని అతిక్రమించినట్టే అని ఆరోపించారు. అన్నట్టు ధన్ సింగ్ రావత్ కోవిద్-19 రెస్పాన్స్ ఇన్-ఛార్జి మంత్రి కూడా.. రూల్స్ పై మంచి అవగాహన ఉన్నప్పటికీ ఆయన ఇతర బీజేపీ నేతలతో ఈ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. చార్ ధామ్ యాత్రపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్నీ పూజారులు వీరికి గుర్తు చేశారు. ప్రజలకు ఒక రూల్, మనకొక రూలా అని ప్రశ్నించారు. కుంభ మేళా, చార్ ధామ్ యాత్ర వంటి మతపరమైన ఈవెంట్లను ఈ కోవిద్ సమయంలో నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ హైకొర్టు ఇటీవల తీవ్రంగా విమర్శించింది. అయినా కోర్టు వ్యాఖ్యలను కూడా పట్టించుకోకుండా వీరు బద్రీనాథ్ ఆలయ సందర్శనకు రావడం వివాదం రేపింది.
కాగా పూజారుల అభ్యంతరాలపై మంత్రి గానీ, బీజేపీ నేతలు గానీ మాట్లాడేందుకు నిరాకరించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక కోవిద్ కేసులున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. అటు ధన్ సింగ్ రావత్ తన సహచరులతో ఇక్కడ కొద్దిసేపు గడిపి తిరిగి డెహ్రాడూన్ బయల్దేరారు.