COVID-19 vaccine insurance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ బీమాపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బీమా సౌకర్యం ఉండాలన్న నిబంధన ఏదీ లేదని చౌబే వెల్లడించారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మంగళవారం సమాధానమిచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాలపాటు వైద్యుల పరిశీలనలో ఉంటారని తెలిపారు. ఒకవేళ ఆ వ్యక్తిలో దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే చికిత్స అందిస్తారని.. లేదా ఇంటికి వెళ్లాక దుష్ప్రభావాలు తలెత్తినా వైద్యసేవలు అందిస్తారని ఆయన తెలిపారు. అంతేగానీ టీకా తీసుకున్న వారికి బీమా సౌకర్యం ఉండాలన్న నిబంధనలు ఏవీ లేవని ఆయన స్పష్టంచేశారు.
కాగా ఇప్పటి వరకు దాదాపు 58 లక్షల మందికి కరోనా టీకాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వారిలో కేవలం 0.18 శాతం మందిలో మాత్రమే దుష్ప్రభావాలు తలెత్తాయని ఇటీవల కేంద్రం తెలిపిందే. అయితే కోవిషిల్డ్, కోవ్యాక్సిన్ తీసుకోని ప్రతికూల ప్రభావానికి గురైన వారంతా ప్రస్తుతం కోలుకున్నారని చౌబే వెల్లడించారు.
Also Read: