Aadhaar Voter ID Link: నేటి నుంచి ఆధార్‌, ఓటర్‌ ఐడీల అనుసంధానం.. ఇంట్లో నుంచే లింక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే

Aadhaar Voter ID Link: ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం (ఆగస్టు 1) నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, అడ్రెస్ మార్పు తదితర..

Aadhaar Voter ID Link: నేటి నుంచి ఆధార్‌, ఓటర్‌ ఐడీల అనుసంధానం.. ఇంట్లో నుంచే లింక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే
Aadhaar Voter Id Link
Follow us

|

Updated on: Aug 01, 2022 | 8:42 AM

Aadhaar Voter ID Link: నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ సోమవారం (ఆగస్టు 1) నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, అడ్రెస్ మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ఈప్రక్రియ కోసం ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కాదని ఐచ్ఛికంగా గుర్తించారు. ఆధార్‌ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఇలా లింక్‌ చేసుకోండి.. కాగా ఎన్నికల సంఘం పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా, ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను అనుసంధానం చేయవచ్చు

NVSP పోర్టల్‌  ద్వారా

ఇవి కూడా చదవండి

ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయొచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లాలి. పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్‌ చేయాలి. పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆధార్ ధ్రువీకరణ కోసం ఈ OTPని నమోదు చేయాలి. ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఇవ్వనున్నారు.

SMS ద్వారా

ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ మెసేజ్‌ను 166 లేదా 51969కి పంపాలి. మెసేజ్ ఫార్మాట్ : ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నంబర్.

ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను ఇవ్వాలి. మీ ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మొబైల్ ఫోన్‌లో దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది.

ఇలా కూడా.. ప్రతి రాష్ట్రంలో అనేక మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ఉంటారు. వీరు ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి, ఓటర్ ID కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేస్తారు. తమ పరిధిలోని ప్రజలకు ఈ సౌకర్యం కల్పించేందుకు ఎప్పటికప్పుడు అవగాహనా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఆ క్యాంప్‌కు వెళ్లి ఆధార్ ఓటర్ ఐడీ వివరాలను ఇచ్చి ఈ రెండు డాక్యూమెంట్లను లింక్ చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ BLOకి ఆధార్ ఓటర్ ID కు సంబంధించిన స్వీయ ధ్రువీకరణ కాపీని అందించాలి. ఆ తరువాత ఆధార్ ఓటర్ ఐడీ అనుసంధానం గురించి BLO ద్వారా మీకు తగిన సమాచారం అందుతుంది.

ఏడాదిలో నాలుగుసార్లు.. కాగా కొత్త నిబంధనల ప్రకారం ఏడాదిలో నాలుగుసార్లు 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా జాబితాలో పేరును నమోదు చేస్తారు. గతంలో జనవరి 1 తరర్వాతనే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశముండేది. అయితే కొత్త నిబంధనలతో జనవరితో పాటు ఏప్రిల్‌, జూలై అక్టోబర్‌ 1వ తేదీలోపు 18 ఏళ్లు నిండితే ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌ను చూడొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..