8 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన రసగుల్లా.. గొంతులో ఇరుక్కోవడంతో విషాదం

రసగుల్లా తిన్న అనంతరం పరుగెత్తిన 8 ఏళ్ల బాలుడి గొంతులో అది ఇరుక్కోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బీహార్‌లోని బోధ్‌గయలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

8 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన రసగుల్లా.. గొంతులో ఇరుక్కోవడంతో విషాదం
Boy Dies After Rasgulla Gets Stuck In His Throat

Updated on: Sep 15, 2026 | 12:51 PM

బోధ్‌గయా, సెప్టెంబర్ 15: ఎనిమిదేళ్ల బాలుడు గొంతులో రసగుల్లా ఇరుక్కోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన బోధ్‌గయా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సోనూ బిఘా గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి జరిగినట్లు సమాచారం. బీహార్‌లోని బోధ్‌గయాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

బోధగయ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనూ బిఘా గ్రామానికి చెందిన బచ్చు యాదవ్‌ కుమారుడు శివమ్‌ కుమార్‌ (8) ఆదివారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉంచిన రసగుల్లాను తినేందుకు బాలుడు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినప్పటికీ బాలుడు మిఠాయి తిన్నాడు. ఆ తర్వాత బాలుడు ఇంట్లో పరుగెత్తడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో రసగుల్లా అతడి గొంతులో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని బోధ్‌గయా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (CHC)కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మగధ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

అయితే బాలుడిని అక్కడికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. శివమ్‌ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో సోనూ బిఘా గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

పిల్లలు తినేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి

పిల్లలు ఆహారం తినే సమయంలో పరుగెత్తడం, ఆడుకోవడం, మాట్లాడుతుండటం ప్రమాదకరంగా మారొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం గొంతులో ఇరుక్కుపోతే శ్వాసనాళం మూసుకుపోయి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్నారులు తినే సమయంలో వారిని పర్యవేక్షించడం, తినేటప్పుడు పరుగెత్తకుండా, ఆడుకోకుండా చూడటం చాలా ముఖ్యం. గొంతులో ఆహారం ఇరుక్కుని శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడితే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us