Viral News: స్కూళ్లకు సెలవులు ఉంటే సంతోషించని విద్యార్థి ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే ఎన్ని రోజులు ఎక్కువగా సెలవులు వస్తే అంతలా ఎగిరి గంతేస్తారు. సాధారణంగా ఎక్కడైనా పిల్లల ఆలోచన ఇలాగే ఉంటుంది. అయితే కేరళకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం సెలవులు ఇవ్వడం ఆపేయండి అంటూ ఏకంగా కలెక్టర్‌కే మెయిల్ పంపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని వయనాడ్‌కు చెందిన సఫూరా నౌషాద్ అనే విద్యార్థిని 6వ తరగతి చదువుతోంది. ఇటీవల రాష్ట్రంలో వరుసగా సెలవులు వస్తున్నాయి. వారాంతపు సెలవుల తర్వాత సోమవారం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. మొహర్రం కారణంగా మంగళవారం కూడా స్కూల్‌కు సెలవు ఉంది. దీంతో గత శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా సెలవులు రావడం నచ్చని సదరు విద్యార్థిని కలెక్టర్ గీతకు ఈ-మెయిల్ పంపింది. బుధవారం కూడా స్కూల్ సెలవు ప్రకటించొద్దని విజ్ఞప్తి చేసింది. వరుసగా నాలుగు రోజులు ఇంట్లోనే ఉండడం ఇబ్బందిగా ఉంది అంటూ మెయిల్ రాసుకొచ్చింది.
దీంతో విద్యార్థిని చేసిన పనికి ఫిదా అయిన కలెక్టర్ సదరు మెయిల్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సదరు చిన్నారిని అభినందించిన కలెక్టర్ మన చిన్నారులు చాలా తెలివైన వారని, వారి ఆలోచనలు విశాలమైనవి పోస్ట్ చేశారు. అలాగే ఈ ప్రపంచం భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందన్న కలెక్టర్ చిన్నారులు ఈ తరానికి గర్వకారణం అని కొనియాడారు.
మరిన్ని నేషనల్ వార్తల కోసం క్లిక్ చేయండి..