
ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు సరైన రంగును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. రంగు అనేది కేవలం చూడటానికి మాత్రమే కాక, నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, శుభ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా నలుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగు ట్యాంక్‌లు అందుబాటులో ఉంటాయి. వాతావరణం, అవసరాలను బట్టి సరైన రంగు ట్యాంక్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఏ ట్యాంక్ ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది..ఇంటి అవసరాలకు ఏది బెస్ట్ ఇప్పుడు చూద్దాం..
నలుపు రంగు సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ట్యాంక్ లోపల నాచు లేదా బ్యాక్టీరియా త్వరగా పెరగవు. నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. కానీ, నలుపు రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల వేసవి కాలంలో ట్యాంక్‌లోని నీరు బాగా వేడెక్కి, వాడటానికి ఇబ్బందిగా మారుతుంది.
తెలుపు రంగు సూర్యరశ్మిని పరావర్తనం చేస్తుంది. కాబట్టి ఎండ తీవ్రత ఎంత ఉన్నా ట్యాంక్‌లోని నీరు త్వరగా వేడెక్కదు. సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది. కానీ, తక్కువ లేయర్లు ఉన్న తెలుపు ట్యాంకుల్లోకి వెలుతురు సులువుగా ప్రవేశిస్తుంది. దీనివల్ల లోపల నాచు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మల్టీలేయర్ UV ప్రొటెక్షన్ ఉన్న తెలుపు ట్యాంకులను ఎంచుకోవడం మంచిది.
నీలం లేదా ఆకుపచ్చ రంగు ట్యాంకులు: ఇవి నలుపు, తెలుపు రంగుల మధ్యస్తంగా పనిచేస్తాయి. సూర్యరశ్మిని కొంతవరకు అడ్డుకుంటూనే, నీరు మరీ ఎక్కువగా వేడెక్కకుండా చూస్తాయి. ఇవి చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.
అయితే, మీ ప్రాంతంలో ఉండే ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతను బట్టి ట్యాంక్ రంగును నిర్ధారించుకోవాలి. ఏ రంగు ట్యాంక్ ఎంచుకున్నా సూర్యరశ్మి లోపలికి వెళ్లకుండా కనీసం 3-4 లేయర్లు ఉన్న ట్యాంక్ ఎంచుకోవాలి. ట్యాంక్‌కు UV స్టెబిలైజ్డ్ కోటింగ్ ఉందో లేదో సరిచూసుకుని కొనుగోలు చేయాలి. అలాగే, మీ ప్రాంతంలో వేసవిలో నీరు చల్లగా ఉండాలి అనుకుంటే త్రిబుల్ లేదా ఫోర్ లేయర్ల తెలుపు రంగు ట్యాంక్ బెస్ట్. ఒకవేళ ట్యాంక్ తరచూ శుభ్రం చేయడం కుదరదు, నాచు పట్టకూడదు అనుకుంటే నలుపు లేదా నీలం రంగు ట్యాంక్‌ను ఎంచుకోవచ్చు.