Telugu News Lifestyle Want Strong Bones Like Iron? Follow These 10 Natural Expert Tips for Better Bone Health
ఎముకలు ఇనుప సువ్వల్లా మారాలంటే ఇలా చేయండి.. నిపుణులు చెప్పిన టాప్ 10 సీక్రెట్స్
నేటి జీవనశైలిలో చిన్న వయసు నుంచే ఎముకల బలహీనత సమస్య పెరుగుతోంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే సరిపడా క్యాల్షియం, విటమిన్-డి, విటమిన్-కె తీసుకోవడం ఎంతో అవసరం. ఆకుకూరలు, నువ్వులు, సోయా ఉత్పత్తులు వంటి పోషకాహారం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రోజూ వ్యాయామం చేయడం, సూర్యరశ్మిలో కొంతసేపు గడపడం, ధూమపానం-మద్యపానానికి దూరంగా ఉండడం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నేటి ఆధునిక జీవనశైలిలో, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. చిన్న వయసు పిల్లల నుండి వృద్ధుల వరకు, కాలు జారి కింద పడితేనో, చిన్నపాటి దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోతున్న సంఘటనలు చూస్తున్నాము. ఇది మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి లోపాల వల్లే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎముకలు గుల్లబారకుండా, పడినా విరగకుండా, ఇనుప సువ్వలు కంటే దృఢంగా ఉండటానికి ఆయుర్వేద నిపుణులు పది జాగ్రత్తలను తెలియజేస్తున్నారు.. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
సరిపడా క్యాల్షియం సరఫరా: ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం అత్యవసరం. పెద్దలకు రోజుకు 450 మి.గ్రా, 20 ఏళ్ల లోపు వారికి 600 మి.గ్రా, గర్భిణీలకు, బాలింతలకు 900 మి.గ్రా క్యాల్షియం అవసరం. ఈ క్యాల్షియంను పొందడానికి ఆకుకూరలు (పొనగంటి, మెంతి, తోటకూర, మునగాకు) అత్యంత చవకైన, సమర్థవంతమైన వనరులు. ఇవి శరీరానికి కావాల్సిన క్యాల్షియంలో 80-90% వరకు అందిస్తాయి. నువ్వుల ఉండ కూడా క్యాల్షియంకు నంబర్ వన్ వనరు, భోజనం తర్వాత ఒకటి తింటే పుష్కలంగా క్యాల్షియం లభిస్తుంది.
విటమిన్ డి లోపం నివారణ: విటమిన్ డి లోపిస్తే, మనం తీసుకున్న ఆహారంలోని క్యాల్షియం శరీరానికి పట్టదు. ఎముకలు బలహీనపడటానికి విటమిన్ డి లోపం ఒక ప్రధాన కారణం. అందువల్ల, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1-2 గంటల లోపు ఎండలో గడపడం లేదా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం అవసరం.
అసిడిక్ ఫుడ్స్ దూరం: ఎముకలు గుల్లబారడానికి ప్రధాన శత్రువు ఆమ్ల స్వభావం గల ఆహారాలు. పంచదార, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, రసాయనాలతో తయారుచేసిన పదార్థాలు ఎముకల్లోని క్యాల్షియంను బయటకు లాగేస్తాయి. రక్తం క్షారంగా ఉండాలి, కానీ ఈ ఆహారాలు ఆమ్లత్వాన్ని పెంచి, ఎముకల క్యాల్షియంను ఉపయోగించుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తాయి.
హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మానుకోండి: తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు పోషకరహితమైనవి. ఇవి క్యాల్షియంను లాగేసుకుని ఎముకలను బలహీనపరుస్తాయి.
విటమిన్ కె ప్రాముఖ్యత: ఎముక దృఢత్వానికి విటమిన్ కె అత్యంత ముఖ్యం. పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు విటమిన్ కె ని పుష్కలంగా అందిస్తాయి. ఇది బోన్ సెల్స్ లోకి క్యాల్షియం చేరడానికి, ఎముకల బలానికి సహాయపడుతుంది. క్యాల్షియం, విటమిన్ డి తో పాటు విటమిన్ కె కూడా తప్పనిసరి.
శారీరక శ్రమ అవసరం: రోజుకు కనీసం ఒక గంట పాటు వ్యాయామం చేయడం వల్ల ఎముకలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బోన్ సెల్స్ ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అంది, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్తాయి. శారీరక శ్రమ లేకపోవడం కూడా ఎముకలు విరగడానికి ఒక కారణంగా నిలుస్తుంది.
సరైన బరువు నిర్వహణ: అధిక బరువు ఎముకలపై భారాన్ని పెంచి, వాటిని బలహీనపరుస్తుంది. ఆదర్శ బరువును నిర్వహించడం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టడం ఎముక పుష్టికి దోహదపడుతుంది.
అనవసర మందుల నివారణ: కొన్ని మందులు, ముఖ్యంగా స్టెరాయిడ్లు, యాంటాసిడ్లు ఎక్కువగా వాడటం వల్ల ఎముకలు గుల్లబారుతాయి. డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్లు వాడటం, కడుపులో మంటకు యాంటాసిడ్లు అతిగా ఉపయోగించడం మానుకోవాలి.
ఈ పది విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా ఎముక పుష్టిని గణనీయంగా పెంచుకోవచ్చు. గుల్లబారిన ఎముకలు కూడా సరైన ఆహారం, జీవనశైలితో 7-10 నెలల్లో తిరిగి బలాన్ని పుంజుకుంటాయి. బోన్ సెల్ ఆయుర్దాయం 25 సంవత్సరాలు కాబట్టి, మంచి ఆహారంతో కొత్త బోన్ సెల్స్ ఏర్పడి, పాత వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి. రోజుకు అరగంట నుండి గంటసేపు ఎండలో ఉండటం ఎముక పుష్టికి అదనపు ప్రయోజనాన్ని అందిస్తుందని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.. అయితే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.