IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే

IRCTC Bali Tour Package: బాలి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో 4 రాత్రులు, 5 రోజుల పాటు బాలిలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ఈ టూర్‌ను రూపొందించారు. ప్యాకేజీ ధరలు రూ.95,500 నుంచి ప్రారంభమవుతాయి.

IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే
Irctc Bali Tour Package

Updated on: Aug 14, 2026 | 2:37 PM

IRCTC Bali Paradise Tour Package Telugu: బాలి అందాలను ఆస్వాదించాలని ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి నేరుగా విమాన ప్రయాణంతో బాలిని చుట్టి వచ్చేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘BALI PARADISE EX – HYDERABAD’ పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో 4 రాత్రులు, 5 రోజుల పాటు బాలి ద్వీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 2026 సెప్టెంబర్ 24న ప్రారంభమవుతుంది.

ప్యాకేజీ ముఖ్య వివరాలు

  • ప్యాకేజీ పేరు: BALI PARADISE EX – HYDERABAD
  • ప్యాకేజీ కోడ్: SHO14
  • ప్రయాణ గమ్యం: బాలి
  • ప్రయాణ విధానం: విమానం
  • వ్యవధి: 4 రాత్రులు / 5 రోజులు
  • టూర్ తేదీ: 24 సెప్టెంబర్ 2026
  • భోజన సదుపాయం: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్

విమాన ప్రయాణ వివరాలు

  • సెప్టెంబర్ 24న రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. విమానం వియత్నాంలోని హో చి మిన్ సిటీ మీదుగా బాలికి చేరుకుంటుంది.
  • హైదరాబాద్ → హో చి మిన్ సిటీ: VJ 1804..  సెప్టెంబర్ 24న రాత్రి 11:35 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, సెప్టెంబర్ 25న ఉదయం 5:35 గంటలకు హో చి మిన్ సిటీ చేరుకుంటుంది.
  • హో చి మిన్ సిటీ → డెన్పసార్: VJ 849.. ఉదయం 7:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:55 గంటలకు డెన్పసార్ చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో డెన్పసార్ → హో చి మిన్ సిటీ విమానం సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 2:05 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి రాత్రి 7:45 గంటలకు బయలుదేరే విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
  • సెప్టెంబర్ 29న రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Bali టూర్ ప్యాకేజీ ధరలు

గదిలో ఎంతమంది ఉంటారనే దానిని బట్టి ప్యాకేజీ ధర మారుతుంది.

ప్యాకేజీ ధరలు:

  • సింగిల్ షేరింగ్: రూ.1,01,600
  • డబుల్ షేరింగ్: రూ.95,900
  • ట్రిపుల్ షేరింగ్: రూ.95,500
  • 2–11 ఏళ్ల పిల్లలు (బెడ్‌తో): రూ.89,050
  • 2–11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): రూ.85,500

5 రోజుల టూర్‌లో ఏయే ప్రదేశాలు సందర్శిస్తారు?

డే 00 – హైదరాబాద్: సెప్టెంబర్ 24న రాత్రి 8 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. విమానాశ్రయ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అనంతరం రాత్రి 11:35 గంటలకు విమానం బయలుదేరుతుంది. రాత్రి ప్రయాణం విమానంలోనే కొనసాగుతుంది.

డే 01 – డెన్పసార్, బాలి: సెప్టెంబర్ 25న మధ్యాహ్నం డెన్పసార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ టూర్ గైడ్ స్వాగతం పలికి హోటల్‌కు తీసుకెళ్తారు. మార్గమధ్యంలో లంచ్ ఉంటుంది. హోటల్‌లో చెక్‌ఇన్ అనంతరం సాయంత్రం జింబరన్ బీచ్ సందర్శిస్తారు. అక్కడ ఇండియన్ డిన్నర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం హోటల్‌కు తిరిగి వెళ్లి రాత్రి బస చేస్తారు.

డే 02 – కింటామణి, ఉబుద్: ఉదయం అల్పాహారం తర్వాత కింటామణి, ఉబుద్ ప్రాంతాల పూర్తి రోజు పర్యటన ఉంటుంది. ప్రసిద్ధ బరోంగ్, కెరిస్ డాన్స్ ప్రదర్శనను వీక్షిస్తారు. అనంతరం సెలుక్‌లో వెండి ఆభరణాల తయారీ, మాస్ గ్రామంలో చెక్క శిల్పకళను చూడవచ్చు. కింటామణిలో మౌంట్ బటూర్ క్రేటర్, లేక్ బటూర్ అందాలను ఆస్వాదిస్తారు. ఆ తర్వాత ఉబుద్‌లోని సేక్రెడ్ మంకీ సాంక్చువరీ, తంపక్సిరింగ్‌లోని తిర్తా ఎంపుల్ ఆలయం సందర్శిస్తారు. రాత్రి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ అనంతరం హోటల్‌కు తిరుగు ప్రయాణం.

డే 03 – తంజుంగ్ బెనోవా, ఉలువాటు: అల్పాహారం తర్వాత తంజుంగ్ బెనోవా బీచ్ సందర్శిస్తారు. ఇక్కడ బనానా బోట్, గ్లాస్ బాటమ్ బోట్ వంటి వాటర్ యాక్టివిటీలను ఆస్వాదించవచ్చు. అనంతరం టర్టిల్ ఐలాండ్ సందర్శిస్తారు. లంచ్ తర్వాత ఉలువాటు ఆలయం సందర్శించి అక్కడి ప్రసిద్ధ కెచక్ డాన్స్ ప్రదర్శనను వీక్షిస్తారు. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన తర్వాత డిన్నర్ చేసి హోటల్‌కు తిరిగి వెళ్తారు.

డే 04 – బాలి ఆలయాల సందర్శన: ఉదయం అల్పాహారం తర్వాత మెంగ్వి గ్రామంలోని తమన్ అయున్ ఆలయం సందర్శిస్తారు. అనంతరం ఉలున్ దాను బ్రటన్ ఆలయం సందర్శిస్తారు. లంచ్ తర్వాత తనాహ్ లాట్ ఆలయం సందర్శిస్తారు. ఇక్కడి సుందరమైన సూర్యాస్తమయం టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. డిన్నర్ అనంతరం హోటల్‌లో బస.

డే 05 – బాలి నుంచి హైదరాబాద్: ఉదయం అల్పాహారం తర్వాత మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి డెన్పసార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరుతారు. విమాన ప్రయాణం ద్వారా హో చి మిన్ సిటీ మీదుగా హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?

ఈ ప్యాకేజీలో హైదరాబాద్–డెన్పసార్–హైదరాబాద్ విమాన టికెట్లు, 3 స్టార్ హోటల్‌లో వసతి, ప్రయాణ ప్రణాళిక ప్రకారం 4 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 లంచ్‌లు, 4 డిన్నర్లు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు రెండు 500 మిల్లీలీటర్ల వాటర్ బాటిళ్లు, పేర్కొన్న ప్రదేశాలకు ఎంట్రీ టికెట్లు, ఏసీ పుష్‌బ్యాక్ డీలక్స్ కోచ్‌లో స్థానిక రవాణా, ప్రొఫెషనల్ ఇంగ్లిష్ మాట్లాడే గైడ్ సేవలు అందిస్తారు.

అలాగే 2 శాతం TCS, భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన 80 ఏళ్లలోపు ప్రయాణికులకు, ముందుగా ఉన్న వ్యాధులు లేని పక్షంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటుంది.

ప్యాకేజీలో లేనివి

ఎయిర్‌పోర్ట్ ట్యాక్స్ లేదా ఫ్యూయల్ సర్‌చార్జీలలో పెరుగుదల, డ్రైవర్లు, గైడ్లు తదితరులకు చెల్లించాల్సిన టిప్స్, వ్యక్తిగత ఖర్చులు, లాండ్రీ, మద్యం, పేర్కొనని ఆహారం లేదా పానీయాలు ప్యాకేజీలో ఉండవు. ప్యాకేజీలో స్పష్టంగా పేర్కొనని ఇతర సేవలకు ప్రయాణికులే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

బుకింగ్ సమయంలో అవసరమైన పత్రాలు

టూర్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీల కాపీలు, ఫొటో, PAN కార్డు సమర్పించాలి.

ముఖ్యమైన నిబంధనలు

హోటల్ చెక్‌ఇన్ సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య, చెక్‌అవుట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఉంటుంది. ఎర్లీ చెక్‌ఇన్, లేట్ చెక్‌అవుట్, స్మోకింగ్ లేదా నాన్-స్మోకింగ్ రూమ్ వంటి ప్రత్యేక అభ్యర్థనలు హోటల్ లభ్యత, నిబంధనలకు లోబడి ఉంటాయి.

సాధారణంగా స్టాండర్డ్ కేటగిరీ గదులే కేటాయిస్తారు. హోటళ్లు లభ్యత ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్యాకేజీ రీఫండ్ చేయబడదు. విమాన ఛార్జీలు, పన్నుల్లో పెరుగుదల ఉంటే అదనపు మొత్తాన్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

ఈ టూర్‌కు 100 శాతం చెల్లింపు బుకింగ్ సమయంలోనే చేయాలి. చెల్లింపు, బుకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టూర్ కన్ఫర్మేషన్ వోచర్ జారీ చేస్తారు. బ్యాంకు ఛార్జీలను కూడా ప్రయాణికులే భరించాలి. టూర్ బుకింగ్‌ను అంగీకరించడం లేదా రద్దు చేయడం వంటి నిర్ణయాలపై IRCTCకి నిబంధనల ప్రకారం హక్కు ఉంటుంది.

Note: ప్యాకేజీ ధరలు, విమాన ఛార్జీలు, పన్నులు, హోటల్ లభ్యత వంటి అంశాలు మారే అవకాశం ఉంది. బుకింగ్‌కు ముందు IRCTC అధికారికంగా ప్రకటించిన తాజా వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఐఆర్‌సీటీసీ BALI PARADISE EX – HYDERABAD టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us