
ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి రెండు కళ్లు సరిపోవు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కాగా ప్రకృతి తన రూపాన్ని మార్చుకుని మనకు అందించే ఒక చల్లని కానుక ఈ శీతాకాలం. ఎండల వేడి, వానల హడావిడి తగ్గాక.. భూమి అంతా తెల్లని మంచు దుప్పటి కప్పుకునే అందమైన కాలం ఇది. వేకువజామున ఆకాశం ఇంకా నిద్రమత్తు వీడకముందే, నేలపై పొగమంచు ఒక తెరలా కమ్ముకోవడం.. ఆ మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే లేత సూర్యకిరణాలు చూడడానికి కన్నుల పండువగా ఉంటాయి. బయట గజగజ వణికించే చలి, ఇంట్లో దుప్పటి వెచ్చదనం, చేతిలో ఆవిర్లు కక్కే కాఫీ కప్పు.. ఈ మూడింటి కలయిక శీతాకాలం ఇచ్చే ఒక మధురమైన కవిత. చీకటి పడగానే వీధుల్లో వెలిగే చలిమంటలు కేవలం శరీరానికే కాదు, ఆత్మీయుల మాటలతో మనసుకి కూడా వెచ్చదనాన్ని పంచుతాయి.
అయితే మన భారతదేశంలో శీతాకాలం ఒకేలా ఉండదు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అద్భుత కావ్యంలా ఆవిష్కృతమవుతుంది. ఉత్తరాదిన హిమాలయాలు తెల్లటి మంచు కిరీటాన్ని ధరించి దేవలోకాన్ని తలపిస్తాయి. కాశ్మీర్ లోయలు, మనాలి కొండలు మంచు పూల వర్షంలో తడిసి ముద్దవుతుంటే, ప్రకృతి ఏదో పెళ్లికూతురిలా ముస్తాబైనట్లు అనిపిస్తుంది. అదే దక్షిణాదికి వచ్చేసరికి, చలి తన తీవ్రతను తగ్గించుకుని ఒక చల్లని పిల్లగాలిలా మారుతుంది. మన తెలుగు నేలపై ఉన్న అరకు, లంబసింగి లోయలు మంచు మేఘాలను భూమిపైకి దించి, ‘ఆంధ్రా కాశ్మీర్’గా మారి కనువిందు చేస్తాయి. ఈ సమయంలోనే ట్రిప్స్ వేయాలనుకునే వారిలో కొంతమంది మంచు కురిసే కొండ ప్రాంతాలను వెళ్తే.. మరికొంత మంది మాత్రం చలికాలంలో వెచ్చని, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసమే ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన ఐదు బెస్ట్ ప్లేస్ ల వివరాలు..
గోవా..
చలికాలంలో వెచ్చని వాతావరణం, సముద్రపు అలలు, బీచ్ లో సన్ బాత్ ఆస్వాదించాలంటే గోవా బెస్ట్ అని అంటుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఇక్కడ మరీ స్పెషల్ అని చెప్పాలి. బాగా, కలంగుట్, అంజునా, పలోలెం వంటి ప్రసిద్ధ బీచ్ లలో రోజంతా గడపవచ్చు. బీచ్ వాకింగ్, వాటర్ స్పోర్ట్స్, సన్ సెట్ వ్యూ, బైక్ రైడ్ లను ఆస్వాదించవచ్చు.
వర్కల ( కేరళ )..
సముద్ర తీరంలో ప్రశాంతత, వెచ్చదనం రెండింటినీ కోరుకునే వారికి కేరళలోని వర్కల ఒక గొప్ప ప్రదేశం. ఎత్తైన కొండచరియలు, అందమైన కేఫ్ లు, విశాలమైన నీలి జలాలతో ఈ తీరం భలే ఉంటుంది.
అండమాన్ నికోబార్ దీవులు..
నీలిరంగు జలాలు, తెల్లని ఇసుక, వెచ్చని సూర్యరశ్మి.. ఇక్కడ శీతాకాలంలో వాతావరణం వెచ్చగా ఉంటుంది. హేవ్ లాక్ దీవి, నీల్ దీవి, రాధానగర్ బీచ్ అనేక రకాల కార్యకలాపాలను అందించే అందమైన ప్రదేశాలు ఇక్కడున్నాయి.
హంపి..
చరిత్ర, సాహసాలను ఇష్టపడే వారికి కర్ణాటకలోని హంపి బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రాచీన దేవాలయాలు, విశిష్టమైన రాతి వాస్తుశిల్పానికి హంపి ప్రసిద్ధి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, రాతి రథం, మాతంగ కొండ వంటి ప్రదేశాలను వీక్షించవచ్చు.
పాండిచ్చేరి..
వెచ్చని సూర్యరశ్మి, ప్రశాంతమైన వాతావరణంతో పాండిచ్చేరి కూడా శీతాకాలపు యాత్రకు మంచి ప్లేస్. ప్రోమనేడ్ బీచ్, ప్యారడైజ్ బీచ్, సెరెనిటీ బీచ్ లను చూడవచ్చు. ఫ్రెంచ్ కాలనీలోని పసుపు, తెలుపు రంగు భవనాలు, ఆరోవిల్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.