
వీకెండ్ వచ్చినా.. పండగొచ్చినా.. ఎప్పుడైనా మంచిగా తినాలన్నా.. నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లల్లో మటన్, చికెన్ ఉండాల్సిందే.. పండుగల వేళల్లో చాలామంది మటన్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే.. చాలా మందికి మేక మాంసం (మటన్) వండటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మటన్ వండినప్పుడు గట్టిగా ఉంటుందని భయపడతారు. కానీ, సరైన పద్ధతులు, పదార్థాలు ఉపయోగిస్తే మటన్ మెత్తగా, నోట్లో కరిగిపోయేలా మారుతుంది. ఈ కథనంలో నోరూరించే ఆంధ్రా స్టైల్ పాతకాలం నాటి మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచికరంగా తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.. దీనిలో మటన్ మెత్తగా ఉడికించడంతోపాటు.. మసాలాలు పట్టించడం.. ఇంకా అద్భుతంగా గ్రేవీని తయారు చేయడం లాంటి విషయాలను చూద్దాం.. ఈ మటన్ రోటీలు, చపాతీలు, అన్నంతో అద్భుతమైన కాంబినేషన్..
మటన్ – మంచిగా కర్రీ కట్, శుభ్రం చేసినది
మసాలా దినుసులు..
నూనె, టమాట, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు..
మటన్ కర్రీ తయారీకి ముందుగా ఒక పాన్ లో నూనె తీసుకోవాలి. మటన్‌లో సహజంగా కొవ్వు ఉంటుంది కాబట్టి, నూనె తక్కువగా వాడడం మంచిది. సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి కొవ్వును తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి, నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ జీర్ణశక్తికి సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. పసుపు అనారోగ్యాలకు అద్భుతమైన పరిష్కారం.
ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలు వేసి, మసాలాలు మటన్ కు బాగా పట్టేలా కలపాలి. మటన్‌ను కుక్కర్లో కాకుండా పాన్‌లో ఉడికిస్తే రుచి బాగా పడుతుంది. మటన్ దానిలోని నీటిని విడుదల చేసి బాగా ఉడుకుతుంది. మటన్ కాస్త ఉడికిన తర్వాత, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన రెండు టమాటోలు వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. టమాటోలు ఎక్కువ పులుపు రాకుండా, గ్రేవీకి మంచి రుచిని అందిస్తాయి. టమాటోలు బాగా మెత్తబడిన తర్వాత కలిపి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఎండు కారం వేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాం కాబట్టి, కారం మోతాదు చూసి వేసుకోవాలి. కారం ఎక్కువ తినడం వల్ల అల్సర్లు రావచ్చని గుర్తుంచుకోవాలి.
ధనియాలు, వెల్లుల్లి పొడి. ఇది రహస్య మిశ్రమం. ఈ పొడిని వేసి బాగా కలపాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి. కొత్తిమీర కేవలం అలంకరణకు మాత్రమే కాదు, శరీరంలోని వేడిని తగ్గించడంలో ఇది చాలా ప్రయోజనకారి. చివరగా, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. గరం మసాలా వేసిన వెంటనే కూరకు అద్భుతమైన సువాసన వస్తుంది.
మటన్ కూర దాదాపు తయారయినట్టు అనిపించినప్పుడు, ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. మనం తక్కువ నూనె వాడినా, అది బాగా బయటకు వచ్చి కూరపై తేలుతుంది. మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు తక్కువ మంటపై బాగా ఉడికించాలి. కూర కొంచెం చిక్కగా మారాలి. ఇంకొద్దిగా నీళ్లు ఉన్నట్టు అనిపిస్తే, మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. మటన్ కర్రీ చిక్కగా, యమ్మీగా తయారైన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి, నోరూరించే ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ సిద్ధమవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..