
దాదాపు అందరి ఇళ్లల్లో పూల మొక్కలు ఉంటాయి.. చాలా మంది మల్లె, కనకాంబరం మొక్కలను పెంచుకుంటారు. అయితే.. సాధారణంగా మల్లె పూలతో పోలిస్తే.. కనకాంబరం పూలు భిన్నంగా ఉంటాయి.. సువాసన, రంగు డిఫెరెంట్.. క్రొసాండ్రా లేదా ఫైర్‌క్రేకర్ ప్లాంట్ అని పిలిచే కనకాంబరం.. సంవత్సరం పొడవునా పూలు పూసే అందమైన మొక్క. ముఖ్యంగా వేసవికాలంలో ఈ మొక్క విపరీతంగా పూలు పూస్తుంది. కనకాంబరం మొక్క నిండా గుత్తులుగా పూలు పూయడానికి సరైన సన్ లైట్, నీటి యాజమాన్యం, మట్టి, ఎరువులు, తెగుళ్ల నియంత్రణ అవసరం అని నిపుణులు చెబుతున్నారు..
సూర్యరశ్మి అవసరాలు: కనకాంబరం మొక్క పుష్కలంగా పూయాలంటే రోజుకు కనీసం ఐదు గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి తప్పనిసరి. ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశంలో మొక్కను ఉంచాలి. అయితే, ఏప్రిల్, మే, జూన్ వంటి వేసవి కాలంలో తీవ్రమైన ఎండ నుండి మొక్కను రక్షించడం ముఖ్యం. ఈ నెలల్లో మొక్కను గ్రీన్ నెట్ కింద లేదా మీ తోటలోని పెద్ద చెట్ల మధ్య ఉంచడం వల్ల ఫిల్టర్ చేయబడిన సూర్యరశ్మి లభిస్తుంది. తద్వారా మొక్క ఎండ వేడిమి నుండి రక్షించబడుతుంది. మిగిలిన సమయంలో మొక్కను రోజంతా ఎండలో ఉంచవచ్చు.
నీటి యాజమాన్యం: నేల ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. అయితే, అధిక నీటిపారుదల (ఓవర్‌వాటరింగ్) ప్రమాదకరం. పై మట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోయడం వల్ల నేలలో ఫంగస్ అభివృద్ధి చెంది, మొక్క వేర్లు కుళ్ళిపోయి పూర్తిగా ఎండిపోతుంది. అందువల్ల, నీరు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మట్టి మిశ్రమం: మొక్క ఎదుగుదలకు, అధిక నీటిపారుదల సమస్యను నివారించడానికి బాగా నీరు ఇంకే, సారవంతమైన మట్టి అవసరం. మట్టి మిశ్రమంలో 40% కంపోస్ట్, 30% కోకోపీట్, 10% ఇసుక, 20% తోట మట్టిని ఉపయోగించవచ్చు. దీనికి కొద్దిగా వేపపిండిని కూడా కలిపితే ఫంగస్ సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.
మొక్కలో కొత్త కొమ్మలు, ఆకులు ఆరోగ్యంగా పెరగడానికి, సమృద్ధిగా పూలు పూయడానికి ఎరువులు చాలా అవసరం.
కంపోస్ట్: ఎనిమిది అంగుళాల కుండీకి నెలకు 100 గ్రాముల కంపోస్ట్, 10-12 అంగుళాల కుండీకి 200 గ్రాముల కంపోస్ట్ ఇవ్వాలి. నేలను లూస్ చేసి ఇవ్వాలి.
డీఏపీ: 15 రోజులకు ఒకసారి అర చెంచా డీఏపీ గుళికలు ఇవ్వడం వల్ల ఫాస్ఫరస్ – నైట్రోజన్ మొక్కకు పుష్కలంగా లభిస్తాయి.
పొటాష్: అర చెంచా రెడ్ పొటాష్ లేదా ఎన్‌పీకే 0:0:50 వంటి పొటాషియం ఆధారిత ఎరువును 15 రోజులకు ఒకసారి ఇవ్వడం వల్ల పువ్వుల ఉత్పత్తి పెరుగుతుంది.
ఎప్సమ్ సాల్ట్: 15 రోజులకు ఒకసారి ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్‌ను నేలలో ఇవ్వవచ్చు లేదా ఒక లీటర్ నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి ఆకులపై స్ప్రే చేయవచ్చు. ఇది కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరచి, ఆకులు పచ్చగా ఉండటానికి సహాయపడుతుంది.
మొక్కకు పూసిన పువ్వులను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ పూలు వస్తాయి.
పూలు పూసిన తర్వాత ఎండిన పూల గుత్తులను (ఫ్లవర్ స్టిక్స్) కట్ చేసి తీసివేయాలి. వీటిని వదిలేస్తే మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పూల ఉత్పత్తి తగ్గిపోతుంది.
కనకాంబరం మొక్కలను కొమ్మల ద్వారా లేదా విత్తనాల ద్వారా ప్రొపగేట్ చేయవచ్చు. ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల పొడవు గల కొమ్మలను కత్తిరించి ఇసుకలో లేదా మట్టిలో నాటితే వేర్లు వస్తాయి.
కనకాంబరం మొక్కలకు పిండినల్లి (మీలీబగ్స్) సమస్య ఎక్కువగా వస్తుంది. లేత కొమ్మలు, చిగుర్ల దగ్గర తెల్లని పిండిలాగా ఇవి కనిపిస్తాయి.
ప్రారంభ దశలో: 5 ml వేప నూనెను ఒక స్పూన్ షాంపూతో కలిపి ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి మొక్కంతా స్ప్రే చేయాలి.
తీవ్రత ఎక్కువగా ఉంటే: యాక్టారా పురుగుల మందును ఒక గ్రాము, ఒక లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి రెండు వారాల పాటు స్ప్రే చేయాలి. ఇది పిండినల్లిని పూర్తిగా నివారిస్తుంది.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ కనకాంబరం మొక్క ఆరోగ్యంగా పెరిగి, మీ తోటను అందమైన గుత్తుల పూలతో అలంకరిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..