
ఒక పెద్ద నదీ తీరంలో జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ చెట్టు పండించే తీయటి జామపండ్లు తింటూ కోతి సంతోషంగా జీవించేది. అదే నదిలో ఒక మొసలి ఉండేది. ఒక రోజు అది చెట్టు దగ్గరకు వచ్చింది. కోతి దానిని చూసి స్నేహంగా పలకరించింది. చెట్టుపై ఉన్న రుచికరమైన జామపండ్లను కోసి మొసలికి ఇచ్చింది. మొసలి వాటిని తిని చాలా ఆనందించింది.
ఆ రోజు నుంచి కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కోతి మొసలికి జామపండ్లు ఇచ్చేది. మొసలి వాటిలో కొన్నింటిని తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు కూడా ఇచ్చేది.
ఒక రోజు మొసలి భార్య ఆ పండ్లు తిని, “ఇంత తీయటి పండ్లు ప్రతిరోజూ తినే కోతి గుండె ఎంత తియ్యగా ఉంటుందో! నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది” అని చెప్పింది. మొసలి ఆశ్చర్యపోయింది. ‘అది నా స్నేహితుడు. నేను అలా చేయలేను’ అని చెప్పింది. కానీ మొసలి భార్య పట్టుబట్టి, ‘నువ్వు నా కోరిక తీర్చకపోతే నేను ఆహారం తినను’ అని మొండికేసింది. భార్య మాటలకు లొంగిపోయిన మొసలి ఒక రోజు కోతి దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా! మా ఇంటికి రా. నా భార్య నిన్ను భోజనానికి ఆహ్వానించింది’ అని చెప్పింది.
కోతి ‘నాకు ఈత రాదు కదా! నేను ఎలా వస్తాను?’ అని అడిగింది.
మొసలి, ‘నా వీపుపై కూర్చో. నేను నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను’ అని చెప్పింది.
కోతి అమాయకంగా మొసలి వీపుపై ఎక్కింది. ఇద్దరూ నది మధ్యలోకి చేరుకున్నప్పుడు మొసలి నిజం చెప్పేసింది. ‘స్నేహితుడా! నన్ను క్షమించు. నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. అని చెప్పింది. అది విన్న కోతి భయపడినా తన తెలివిని ఉపయోగించింది. ‘అయ్యో! నువ్వు ముందే చెప్పాల్సింది. నా గుండెను నేను చెట్టుపైనే ఉంచి వచ్చాను. వెంటనే తిరిగి వెళ్దాం. నేను గుండె తీసుకుని వస్తాను’ అని చెప్పింది. మొసలి నిజంగానే నమ్మింది. వెంటనే తిరిగి చెట్టు దగ్గరకు తీసుకువచ్చింది.
చెట్టు దగ్గరకు చేరగానే కోతి చాకచక్యంగా పైకి ఎగిరి కొమ్మపై కూర్చుంది. తర్వాత మొసలితో ఇలా చెప్పింది ‘మూర్ఖుడా! ఎవరు తమ గుండెను చెట్టు మీద ఉంచుతారు? నన్ను మోసం చేయాలని చూసావు. నిజమైన స్నేహితుడిని ద్రోహం చేశావు. ఇకపై నేను నిన్ను నమ్మను’. మొసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. కోతి తన తెలివితో ప్రాణాలను కాపాడుకుంది.
ఆపద సమయంలో ధైర్యం, తెలివితేటలు ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. అలాగే నిజమైన స్నేహాన్ని ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. అమాయకంగా అందరినీ నమ్మకూడదు. వివేకంతో వ్యవహరించాలి. బుద్ధి బలం కంటే గొప్పది.