అటుకులతో పులిహోర చేయడాన్నే పోహా అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి అతి కొద్ది మందికే తెలుసు. మహారాష్ట్రలో ఎక్కువగా పోహాను చేసుకుంటుంటారు. అచ్చు పులిహోర తరహాలోనే ఉంటుంది. కానీ కాస్త రుచి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు.. దీనివలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనిని ఉదయం అల్పహారంగా తీసుకుంటుంటారు. దీనిని అటుకుల ఉప్మా అని కూడా అంటారు. అయితే అతి తక్కువ సమయంలోనే ఈ పోహాను రెడీ చేసుకోవచ్చు. అదేలానో తెలుసుకుందామా..
ప్రస్తుత హడవిడి పరుగుల జీవితంలో ఇంట్లో వంటచేసుకునే సమయం లేక..చాలా మంది బయటి ఫుడ్‌కు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అలాంటి వారికి పోహా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పోహాను రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలతో కేవలం 10 నిమిషాల్లోనే పోహా తయారుచేసుకోవచ్చు. తయారీ విధానం తెలుసుకుందాం.
అటుకులు- ఒక కప్పు.
కరివేపాకు- 2 రెమ్మలు
కొత్తిమీర -కొద్దిగా
నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర -1/2 టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు -1/2 టీస్పూన్
పసుపు -1/4 టీస్పూన్
పచ్చిమిర్చి -3
వేరుశెనగలు -2 టేబుల్ స్పూన్స్
పెద్ద ఉల్లిపాయ- 1/2
పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్,
ఉప్పు -తగినంత
ముందుగా అటుకులను నీటిలో కడిగి ఆ తర్వాత నీరు లేకుండా నెమ్మదిగా పిండి పక్కన పెట్టుకోవాలి. జల్లెడలో నీరు ఇంకే వరకు అందులో పెట్టాలి. జల్లెడ లేకపోతే ఏదైన వస్త్రంతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి తగినంత నూనెను వేడి చేయాలి. ఆ తర్వాత జీలకర్ర, వేరుశెనగ పప్పు, పచ్చి మిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. చివర్లో ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలపాలి. అటుకులు వేగేప్పుడు స్టవ్ ఆన్‌లోనే ఉండాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని అటుకుల్లో వేసి.. అది మొత్తం అటుకులలో కలిసిపోయేంతవరకు కలుపుతునే ఉండాలి. అంతే రుచికరమైన పోహా రెడీ. దీనిని మరింత అందంగా చేయాలనుకుంటే టమోటా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. పోహాలో మిక్చర్ వేసుకుంటే కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ కలపకుండా కూడా పోహాను తయారు చేసుకోవచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రుచికరమైన పోహాను రెడీ చేసేయండి.
Also Read:
బ్లాక్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా ? మీ డైట్లో ఈ మార్పులు చేసుకోవాలంటా.. నిపుణుల సూచనలు..