
పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి శరీరం, మనస్సులో అనేక సహజ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల సమయంలో వారి ప్రవర్తనలో కూడా కొన్ని కొత్త అంశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పిల్లలు బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం గమనించినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భయపడటం, మందలించడం లేదా అనుమానించడం కంటే అర్థం చేసుకుని వ్యవహరించడం ఎంతో ముఖ్యమని మనోవైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల ఓ తల్లి తన 9 ఏళ్ల కుమారుడు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నాడని మనోవైద్యురాలు కోమల్ బక్షిని సంప్రదించారు. దీనిపై స్పందించిన ఆమె.. 8 నుంచి 9 ఏళ్ల వయస్సు నుంచే పిల్లల్లో తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవాలనే సహజమైన ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ వయస్సులో పిల్లలు తమ శరీరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని, దాన్ని చెడు అలవాటుగా చూడకూడదని సూచించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర నిర్మాణం, పెరుగుదల, మార్పుల గురించి ఆసక్తి అబ్బాయిల్లోనే కాదు, అమ్మాయిల్లో కూడా సాధారణమే. పిల్లలు తమ శరీరాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో అనేక ప్రశ్నలు కలిగి ఉంటారు. ఈ సమయంలో వారిని తిట్టడం, భయపెట్టడం లేదా అవమానించడం వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ముందుగా పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడాలి. వారి వయస్సుకు తగిన భాషలో శరీరంలో మార్పులు రావడం సహజమని వివరించాలి. పిల్లలు ఎలాంటి సందేహాలైనా స్వేచ్ఛగా అడగగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. దీంతో వారు తప్పుడు సమాచారానికి దూరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన అవగాహనను పెంపొందించుకుంటారు.
పిల్లలు వయసుకు తగని లేదా అశ్లీల కంటెంట్‌కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్, ఇంటర్నెట్ వినియోగంపై సరైన పర్యవేక్షణ అవసరమే అయినప్పటికీ, అది పిల్లల గోప్యతకు భంగం కలగకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలను ఆటలు, క్రీడలు, పుస్తక పఠనం, కళలు, ఇతర అభిరుచులు వంటి కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల వారి శారీరక, మానసిక వికాసం మెరుగుపడటమే కాకుండా, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నారని వారిని ప్రశ్నించడం, ఎగతాళి చేయడం, అవమానించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ప్రవర్తన పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరమయ్యే పరిస్థితికి దారితీయవచ్చు. బదులుగా, వారి భావాలను అర్థం చేసుకుని, నమ్మకంతో మాట్లాడితే వారు ఎదుగుదలలో భాగమైన ఈ దశను ఆరోగ్యకరంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరని మనోవైద్యులు సూచిస్తున్నారు.