
చుండ్రు సమస్య తీవ్రంగా మారి బట్టలపై రాలడం, చేతితో తల తాకినప్పుడు చుండ్రు అంటుకోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ఎన్ని ఉత్పత్తులు వాడినా చుండ్రు తగ్గకపోతే, సహజ సిద్ధమైన వేప నూనె ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీ-ఫంగల్ గుణాలు ఉన్న వేప నూనె చుండ్రును తగ్గించడమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. అయితే వేప నూనెను నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి వాడటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
వేప నూనె – కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె: కొబ్బరి నూనె సహజ తేమను అందించి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. సమాన భాగాలలో వేప నూనె, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కలిపి తల చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి. 20–30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
వేప నూనె – టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ ఒక ఎసెన్షియల్ ఆయిల్; దీనిని ఎప్పుడూ నేరుగా రాయకూడదు. కొబ్బరి నూనెలో వేప నూనెతో పాటు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి మసాజ్ చేసి, 20–30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి.
వేప నూనె – చిక్కటి పెరుగు: ప్రోబయోటిక్ గుణాలున్న పెరుగు, యాంటీ-ఫంగల్ వేప నూనెతో కలిసి చుండ్రు తగ్గించడంలో సహాయపడుతుంది. చిక్కటి పెరుగులో కొన్ని చుక్కల వేప నూనె కలిపి తలకు పట్టించి, షవర్ క్యాప్ ధరించి 30–45 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి రెండుసార్లు చేయవచ్చు.
వేప నూనె – నిమ్మరసం, ఆలివ్ నూనె: విటమిన్ సి ఉన్న నిమ్మరసం తల చర్మం పీహెచ్ సమతుల్యతకు సహాయపడుతుంది. ఒక టీస్పూన్ పలుచన చేసిన నిమ్మరసం, కొన్ని చుక్కల వేప నూనె, తగినంత ఆలివ్ నూనె కలిపి మసాజ్ చేసి, 20–30 నిమిషాల తర్వాత రసాయనాలు లేని షాంపూతో కడగాలి.
వేప నూనె – కలబంద గుజ్జు: రెండు టీస్పూన్ల కలబంద గుజ్జులో ఒక టీస్పూన్ వేప నూనె కలిపి తలకు రాసి, 30–40 నిమిషాల తర్వాత కడగాలి. ఇది దురద, చికాకు నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఈ నివారణలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా చుండ్రు సమస్య తగ్గి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.