ప్రపంచంలోనే బెస్ట్ టీ ఏదో తెలుసా? భారతీయ సంప్రాదయ చాయ్‌కి విశ్వ కిరీటం..!

భారతీయులకు టీ అంటే కేవలం ఓ పానీయం కాదు.. అది ఓ ఎమోషన్‌. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు చాయ్‌, స్నేహితులతో కలిసినప్పుడు ‘చాయ్‌ పే చర్చ’, పని మధ్యలో చిన్న బ్రేక్‌.. ఇలా భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అదే భారతీయ చాయ్‌ ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. ప్రముఖ ఫుడ్‌ గైడ్‌ TasteAtlas విడుదల చేసిన ‘ప్రపంచంలోని టాప్ 100 చాయ్‌ల’ జాబితాలో భారతీయ టీలు ఏకంగా ఆరు స్థానాలను దక్కించుకున్నాయి.

ప్రపంచంలోనే బెస్ట్ టీ ఏదో తెలుసా? భారతీయ సంప్రాదయ చాయ్‌కి విశ్వ కిరీటం..!
Indian Masala Tea

Updated on: Sep 01, 2026 | 6:20 AM

భారతీయులకు టీ అంటే కేవలం ఓ పానీయం కాదు.. అది ఓ ఎమోషన్‌. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు చాయ్‌, స్నేహితులతో కలిసినప్పుడు ‘చాయ్‌ పే చర్చ’, పని మధ్యలో చిన్న బ్రేక్‌.. ఇలా భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అదే భారతీయ చాయ్‌ ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. ప్రముఖ ఫుడ్‌ గైడ్‌ TasteAtlas విడుదల చేసిన ‘ప్రపంచంలోని టాప్ 100 చాయ్‌ల’ జాబితాలో భారతీయ టీలు ఏకంగా ఆరు స్థానాలను దక్కించుకున్నాయి.

ప్రపంచంలో నంబర్‌ వన్‌.. మసాలా చాయ్‌!

ఈ జాబితాలో భారతదేశానికి అత్యంత ఘనమైన గుర్తింపు లభించింది. మసాలా చాయ్‌ ప్రపంచంలోని అత్యుత్తమ టీల్లో మొదటి స్థానంలో నిలిచింది. టీకి పాలు, టీ పొడి, చక్కెరతో పాటు అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి తయారు చేసే మసాలా చాయ్‌.. దాని ఘాటైన రుచి, సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. భారతీయ టీ సంస్కృతిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పానీయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

టాప్‌ 100లో ఆరు భారతీయ టీలు

TasteAtlas జాబితాలో మసాలా చాయ్‌తో పాటు మరో ఐదు భారతీయ టీలు కూడా చోటు సంపాదించాయి.

మసాలా చాయ్‌ – 1వ స్థానం

డార్జిలింగ్‌ టీ – 6వ స్థానం

అస్సాం చాయ్‌ – 13వ స్థానం

సులైమాని చాయ్‌ – 39వ స్థానం

కాంగ్రా టీ – 41వ స్థానం

నూన్‌ చాయ్‌ – 43వ స్థానం

దీంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టీ సంప్రదాయాలు, రుచుల వైవిధ్యం మరోసారి ప్రపంచానికి పరిచయమైంది.

డార్జిలింగ్‌ నుంచి అస్సాం వరకు..

డార్జిలింగ్‌ టీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీయ టీ రకం. పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతాల్లో పండించే ఈ టీ సున్నితమైన రుచి, ప్రత్యేకమైన సువాసనకు ప్రసిద్ధి చెందింది. జాబితాలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. ఇక అస్సాం టీ తన బలమైన రుచి, ఘాటైన రంగు, ప్రత్యేకమైన సువాసనకు పేరుగాంచింది. ప్రపంచంలోని ప్రసిద్ధ బ్లాక్‌ టీల్లో అస్సాం టీకి ప్రత్యేక స్థానం ఉంది. TasteAtlas ర్యాంకింగ్స్‌లో ఇది 13వ స్థానాన్ని దక్కించుకుంది.

టాప్‌ 50లో కాశ్మీర్‌ నూన్‌ చాయ్‌..

భారతీయ టీ వైవిధ్యానికి మరో అద్భుతమైన ఉదాహరణ నూన్‌ చాయ్‌. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ టీ సాధారణ టీకి పూర్తి భిన్నంగా ఉంటుంది. గులాబీ రంగులో కనిపించే ఈ పానీయంలో ఉప్పును ఉపయోగిస్తారు. అందుకే దీనిని పింక టీ అని కూడా పిలుస్తారు. మొదటిసారి నూన్‌ చాయ్‌ తాగే వారికి దాని ఉప్పటి రుచి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే కాశ్మీర్‌ సంస్కృతి, ఆతిథ్యంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ టాప్‌ టీల జాబితాలో ఇది 43వ స్థానంలో నిలిచింది.

సులైమాని, కాంగ్రా టీలకు గుర్తింపు

కేరళకు చెందిన సులైమాని చాయ్‌ 39వ స్థానాన్ని సాధించింది. సాధారణంగా పాలు లేకుండా తయారు చేసే ఈ టీకి ప్రత్యేకమైన సుగంధం, తేలికపాటి రుచి ఉంటుంది. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రా టీ 41వ స్థానంలో నిలిచింది. కాంగ్రా లోయలో సాగు చేసే ఈ టీకి ప్రాంతీయ ప్రత్యేకతతో పాటు సుదీర్ఘమైన తేయాకు సాగు సంప్రదాయం ఉంది.

ప్రపంచ టాప్‌ 5లో ఏ దేశాల టీలు?

TasteAtlas జాబితాలో భారతీయ మసాలా చాయ్‌ తర్వాత జపాన్‌కు చెందిన హోజిచా రెండో స్థానంలో ఉంది. వేయించిన గ్రీన్‌ టీగా ప్రసిద్ధి చెందిన హోజిచాకు ప్రత్యేకమైన టోస్టెడ్‌ ఫ్లేవర్‌ ఉంటుంది. ఇక మూడో స్థానంలో శ్రీలంక సిలోన్‌ బ్లాక్‌ టీ నిలిచింది. నాలుగో స్థానాన్ని జపాన్‌కు చెందిన సెంచా దక్కించుకోగా, ఐదో స్థానంలో చైనాకు చెందిన పు ఎర్‌ టీ ఉంది. పు ఎర్‌ టీని ఎక్కువ కాలం నిల్వ చేసి పాతబడే కొద్దీ ప్రత్యేకమైన రుచి వచ్చే టీగా భావిస్తారు.

టీ తోటలకూ ప్రపంచ గుర్తింపు

భారతీయ టీకి గుర్తింపు కేవలం టీ రకాలకే పరిమితం కాలేదు. దేశంలోని ప్రసిద్ధ తేయాకు తోటలు, టీ ఎస్టేట్లకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్‌లో ఉన్న మకైబారి టీ ఎస్టేట్‌ 1859లో స్థాపించారు. దీర్ఘకాలిక టీ సాగు సంప్రదాయం, నాణ్యమైన టీ ఉత్పత్తికి ఇది ప్రసిద్ధి చెందింది. అలాగే, అస్సాంలోని దిబ్రుగఢ్‌కు చెందిన హల్మరి టీ ఎస్టేట్‌ కూడా తన ప్రత్యేకమైన అస్సాం టీకి గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలోని తేయాకు తోటలు భారతదేశ టీ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

‘చాయ్‌ పే చర్చ’.. నిజంగానే ఓ ఎమోషన్‌!

భారతదేశంలో టీకి ఉన్న ప్రాధాన్యతను కేవలం రుచి, నాణ్యతతో కొలవలేం. టీ ఒక సామాజిక అనుబంధం. ఇంటికి వచ్చిన అతిథికి టీ ఇవ్వడం నుంచి స్నేహితులతో గంటల తరబడి చర్చలు జరపడం వరకు.. చాయ్‌ భారతీయ జీవనశైలిలో భాగమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ టీల జాబితాలో భారతీయ టీలకు దక్కిన ఈ గుర్తింపు దేశంలోని విభిన్న టీ సంస్కృతికి అంతర్జాతీయ ముద్ర వేసినట్టే. ముఖ్యంగా మసాలా చాయ్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకోవడం భారతీయ టీ ప్రియులకు నిజంగా గర్వకారణమే.

ఒక్క మాటలో చెప్పాలంటే.. భారతీయులకు చాయ్‌ ఒక పానీయం మాత్రమే కాదు.. ఒక అలవాటు, ఒక అనుబంధం, ఒక సంభాషణ. ఇప్పుడు ప్రపంచం కూడా అదే విషయాన్ని గుర్తించినట్టే..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us