ఎండిపోతున్న తులసి చెట్టు మళ్లీ పచ్చగా మారాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు ఊహించని..

ఇంటి ముందర తులసి కోట.. పచ్చని ఆకులతో కళకళలాడుతుంటే ఆ అందమే వేరు.. కానీ, మీ తులసి మొక్క ఆకులు వాడిపోతున్నాయా? తెల్లటి తెగుళ్లతో మొక్క జీవం కోల్పోతోందా? బయట దొరికే రసాయనాలు వాడితే పవిత్రత దెబ్బతింటుందని భయపడుతున్నారా? అయితే చింతించకండి.. మన వంటింట్లో ఉండే వెల్లుల్లి, పసుపు మీ తులసి మొక్కకు సంజీవనిలా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండిపోతున్న తులసి చెట్టు మళ్లీ పచ్చగా మారాలంటే ఇలా చేస్తే చాలు.. మీరు ఊహించని..
How To Save A Dying Tulsi Plant

Updated on: Apr 23, 2026 | 8:28 PM

భారతీయ ఇళ్లలో తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదు.. అది ఒక నమ్మకం, ఒక పవిత్రత, ఇంటి ఆరోగ్యాన్ని కాపాడే సహజ వైద్యుడు. అందుకే తులసి కోటలో మొక్క పచ్చగా ఉంటే ఇల్లంతా సానుకూల శక్తితో నిండినట్లు అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఆకులు పసుపు రంగులోకి మారడం, తెల్లటి సాలెగూళ్లు రావడం లేదా ఆకులు ముడతలు పడి రాలిపోవడం చూస్తే ఏదో అశుభం జరుగుతోందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే భయం వద్దు.. మీ తులసి మొక్క ఎండిపోవడానికి కారణం దోషం కాదు.. అది కేవలం తెగులు మాత్రమే. మన వంటింట్లో ఉండే వస్తువులతోనే ఆ పురుగులను తరిమికొట్టి, తులసిని మళ్లీ కళకళలాడేలా చేయవచ్చు.

తులసికి వచ్చే ఆ అదృశ్య శత్రువులు ఎవరు..?

వాతావరణంలో మార్పులు, కుండీలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం లేదా సరైన ఎండ తగలకపోవడం వల్ల తులసిని తెగుళ్లు ఆశిస్తాయి. పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. ఆకులపై జిగురులాంటి పదార్థం కనిపిస్తే, అది పురుగుల పెరుగుదలకు సంకేతం. ఇది కిరణజన్య సంయోగ క్రియను అడ్డుకుంటుంది.

వంటింట్లోనే ఉంది పరిష్కారం:

వేప నీటి పిచికారీ

వేపలో ఉండే చేదు గుణం పురుగులకు సింహస్వప్నం. గుప్పెడు వేప ఆకులను నీటిలో మరిగించి లేదా ఒక చెంచా వేప నూనెను లీటరు నీటిలో కలిపి మొక్కకు స్నానం చేయించండి. ఇది సహజమైన యాంటీ-సెప్టిక్ లా పనిచేస్తుంది.

వెల్లుల్లి – పచ్చిమిర్చి ఘాటు

పురుగులకు ఘాటైన వాసన అంటే పడదు. రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని నీటిలో కలిపి వడకట్టండి. ఈ నీటిని ఆకులపై స్ప్రే చేస్తే, ఎంతటి మొండి పురుగులైనా మాయమవ్వాల్సిందే.

పసుపు, కట్టెల బూడిద

నేలలో బూజు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా పసుపును లేదా పొయ్యిలోని బూడిదను ఆకులపై, వేర్ల దగ్గర చల్లండి. ఇది ఫంగస్ రాకుండా రక్షిస్తుంది.

మొక్క మళ్లీ చిగురించాలంటే ఏం చేయాలి..?

పురుగులు పోయిన తర్వాత మొక్కకు బలం కావాలి. ఎండిపోయిన కొమ్మలను, విత్తనాలు వచ్చిన కొమ్మలను కత్తిరించండి. దీనివల్ల మొక్క శక్తి వృధా కాకుండా కొత్త రెమ్మలు రావడానికి దోహదపడుతుంది. అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి వేర్ల దగ్గర వేయండి లేదా కొద్దిగా వర్మీకంపోస్ట్ వాడండి. తులసికి నైట్రోజన్ కంటే పొటాషియం ఎక్కువగా అవసరం.

Follow Us