
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కోడిగుడ్లు మన దైనందిన ఆహారంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లతో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే, మన ఇంట్లో ఉన్న గుడ్లు తాజాగా ఉన్నాయా లేక కుళ్ళిపోయాయా అనేది పగలకుట్టకుండా చెప్పడం కాస్త కష్టమైన విషయమే. పాడైపోయిన గుడ్డును పొరపాటున తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ గుడ్డు మంచిదో కాదో నిమిషాల్లో తెలుసుకునే కొన్ని సులువైన గృహ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
గుడ్డు నాణ్యతను పరీక్షించడానికి ఇది అత్యంత ప్రసిద్ధమైన, శాస్త్రీయమైన పద్ధతి. ఒక గాజు గ్లాసు లేదా పాత్రలో చల్లని నీటిని నింపి, అందులో గుడ్డును వేయండి. గుడ్డు పాత్ర అడుగు భాగానికి చేరి అడ్డంగా పడుకుంటే అది అత్యంత తాజాదని అర్థం. అలా కాకుండా గుడ్డు అడుగున నిలువుగా ఉంటే అది కొన్ని రోజుల పాతదని, కానీ తినడానికి సురక్షితమైనదని అర్థం. లేదా గుడ్డు నీటి పైన తేలియాడితే అది పూర్తిగా పాడైపోయిందని, కుళ్ళిపోయిందని గుర్తించాలి. ఎలాగంటే.. గుడ్డు పాతబడే కొద్దీ దాని లోపల ఉన్న గాలి బుడగ పరిమాణం పెరుగుతుంది. అందువల్ల అది నీటిపై తేలుతుంది. .
గుడ్డును పగలగొట్టిన తర్వాత దాని నుంచి తీవ్రమైన, అసహ్యకరమైన దుర్వాసన వస్తే అది కుళ్ళిపోయిందని స్పష్టమవుతుంది. తాజా గుడ్డుకు ఎటువంటి బలమైన వాసన ఉండదు.
గుడ్డును చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా ఊపి చూడండి. లోపల ద్రవం కదులుతున్నట్లు గలగల శబ్దం వస్తే ఆ గుడ్డు పాతబడిందని లేదా పాడైపోయిందని అర్థం. తాజా గుడ్డులో గాలి తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి శబ్దం రాదు.
చీకటి గదిలో గుడ్డు వెనుక వైపు మొబైల్ ఫ్లాష్‌లైట్ వేసి చూడండి. లోపల కాంతి స్పష్టంగా ప్రసరిస్తూ గాలి బుడగ చిన్నదిగా కనిపిస్తే అది తాజా గుడ్డు. ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు వంట చేసే ముందే పాడైపోయిన గుడ్లను సులభంగా గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..