
చాలామంది బాటిల్‌లో నీళ్లు అయిపోగానే మళ్ళీ నీళ్లు నింపుతారు తప్ప, దానిని ప్రతిరోజూ శుభ్రం చేయరు. బాటిల్ అడుగున, మూలల్లో పేరుకుపోయే మురికి కంటికి కనిపించకపోయినా, అది ఇన్ఫెక్షన్ల నిలయంగా మారుతుంది. ముఖ్యంగా బాటిల్ మూతలు, స్ట్రాలు బ్యాక్టీరియాకు ఇష్టమైన స్థావరాలు. మరి ఇంట్లోనే దొరికే నిమ్మకాయ, బేకింగ్ సోడాతో మీ వాటర్ బాటిల్‌ను ఎలా మెరిపించాలో, ఆ సూక్ష్మజీవుల నుండి మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం..
1. రోజూ కడగడం మర్చిపోవద్దు:
బాటిల్‌ను రోజుల తరబడి కడగకుండా వాడటం అత్యంత ప్రమాదకరం. వీలైతే ప్రతిరోజూ, లేదంటే కనీసం రెండు రోజులకు ఒకసారి బాటిల్‌ను గోరువెచ్చని నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేయాలి.
2. బాటిల్ బ్రష్ వాడకం:
చేతులు బాటిల్ లోపలి మూలలను చేరుకోలేవు. కాబట్టి, బాటిల్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ‘బాటిల్ బ్రష్’ను ఉపయోగించడం వల్ల అడుగున పేరుకుపోయిన మురికిని పూర్తిగా తొలగించవచ్చు.
3. మూత, స్ట్రాలపై దృష్టి:
బాటిల్ మూత, పై అంచు మరియు స్ట్రా భాగాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. ఈ భాగాలను బ్రష్‌తో బాగా స్క్రబ్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుండి తప్పించుకోవచ్చు.
4. దుర్వాసన వస్తుంటే ఏం చేయాలి?
బాటిల్ నుండి వింత వాసన వస్తుంటే ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి, గోరువెచ్చని నీటితో నింపి 20 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే దుర్వాసన మాయమై బాటిల్ తాజాగా మారుతుంది.
5. ఆరనివ్వడం ముఖ్యం:
బాటిల్ శుభ్రం చేసిన తర్వాత దానిని ఎండలో లేదా గాలికి పూర్తిగా ఆరనివ్వాలి. తేమ ఉంటే ముఖ్యంగా సిలికాన్ భాగాలపై బూజు (Mold) ఏర్పడే ప్రమాదం ఉంది.