
డేటింగ్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మొదటి కలయికలో అతిగా విషయాలు పంచుకోకపోవడాన్ని ‘ఫ్లడ్‌లైటింగ్’ అంటారు. అలాగే పర్‌ఫెక్ట్ పార్ట్‌నర్ కోసం కాకుండా కేవలం క్యాజువల్ రిలేషన్ కోసం చూసేదానిని ‘6-7 ట్రెండ్’ అంటారు. మంకీ బారింగ్, బ్రెడ్‌క్రంబింగ్ వంటి ఎన్నో వింత ధోరణులను చూసిన డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు ఊహించని మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే ‘గ్రేవ్‌యార్డ్ డేటింగ్’ (Graveyard Dating).
పబ్‌లలో హోరెత్తే సంగీతం, నగరాల్లోని కాఫీ షాపుల్లో ఉండే రద్దీ, చుట్టుపక్కల వారి పీల చూపుల నుంచి తప్పించుకోవడానికి ఈ నిశ్శబ్ద ప్రాంతాలు చక్కటి వేదికగా మారుతున్నాయని డేటర్స్ చెబుతున్నారు. స్మశానాల్లో ఉండే నిశ్శబ్దం, పచ్చదనం, పాత రాతి కట్టడాలు మనసుకు ఒక రకమైన ప్రశాంతతను ఇస్తాయి.
ఈ ప్రశాంత వాతావరణంలో పైపైన మాట్లాడే ముచ్చట్లు కాకుండా.. జీవితం, భయాలు, కలలు మరియు ఇష్టాల గురించి లోతైన చర్చలు సాగుతాయి. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్ల గోల లేకుండా, సమయాన్ని ఆస్వాదిస్తూ ఒకరినొకరు ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి ఈ వింత డేటింగ్ దోహదపడుతుందని యువత భావిస్తోంది. ఇద్దరి ఆలోచనలు ఎంతవరకు కలుస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక రకమైన ‘కంపాటబిలిటీ టెస్ట్’ లాగా ఉపయోగపడుతోందని నెటిజన్లు వివరిస్తున్నారు.
చీకటి పడిన తర్వాత ఆ ప్రాంతాల్లో తిరగడం చాలామందికి భయాందోళన కలిగిస్తుంది. సమాధుల మధ్య కూర్చుని రొమాన్స్ చేయడం లేదా ముద్దులు పెట్టుకోవడం అందరికీ నచ్చే విషయం కాదు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే ఎవరికైనా ఒంటరి ప్రదేశాలు ఎంత ప్రమాదకరమో బాగా తెలుసు.
ఇలాంటి నిర్జన ప్రదేశాలలో లైటింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి అపరిచితుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి డేటింగ్‌కు వెళ్లేవారు తమ లైవ్ లొకేషన్‌ను నమ్మకమైన స్నేహితులకు షేర్ చేయడం, ఫోన్ పూర్తిగా చార్జ్ చేసుకోవడం, పెప్పర్ స్ప్రే వంటి రక్షణ సాధనాలను వెంట ఉంచుకోవడం అత్యంత అవసరం. మీ పార్ట్‌నర్‌కు ఇష్టం లేకపోయినా ‘ఇది ఒక వెరైటీ ట్రెండ్’ అంటూ బలవంతం చేయకూడదు.
స్మశానాన్ని ఒక పార్కులా భావించి అక్కడికి వెళ్లినప్పుడు కొన్ని హద్దులు పాటించాలి. అక్కడ ఎలాంటి చెత్త వేయకూడదు, పెద్దగా పాటలు పెట్టకూడదు. సమాధులపై ఉండే పువ్వులను తాకడం లేదా కోయడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అది ఎందరో వ్యక్తుల జ్ఞాపకాలకు, శోకానికి సంబంధించిన ప్రదేశం. కాబట్టి ఆ ప్రాంతానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎవరి ఇష్టాలు వారివి. ఈ ట్రెండ్ చాలామందికి నచ్చకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం ఇది నచ్చుతోంది.