
జీవితంలో మొదటిసారి సంపాదన ప్రారంభించినప్పుడు లేదా కెరీర్‌లో మంచి జీతం లభించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే, చేతిలోకి డబ్బు రాగానే చాలామంది ఉత్సాహంలో అవసరానికి మించి ఖర్చులు చేస్తూ, భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది సంపాదన ప్రారంభ దశ నుంచే అలవడాలి. సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలి, అనవసర ఖర్చులను ఎలా అదుపులో పెట్టుకోవాలి, భవిష్యత్తు కోసం స్మార్ట్‌గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ మొదటి సంపాదనను సరైన పద్ధతిలో మేనేజ్ చేస్తూ, ఆర్థికంగా స్థిరపడటానికి సహాయపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
చేతికి జీతం రాగానే ముందుగా ఒక నెలకు సరిపడా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన 50:30:20 రూల్‌ను పాటించవచ్చు. మీ మొత్తం ఆదాయంలో 50శాతం డబ్బును ఇల్లు, నిత్యావసరాలు, బిల్లుల వంటి కనీస అవసరాల కోసం కేటాయించాలి. 30శాతం డబ్బును షాపింగ్, వినోదం, ప్రయాణాల వంటి మీ వ్యక్తిగత కోరికల కోసం వాడుకోవచ్చు. ఇక మిగిలిన 20శాతం డబ్బును ఖచ్చితంగా పొదుపు లేదా పెట్టుబడిగా మార్చాలి.
జీవితంలో ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో ఎవరూ ఊహించలేరు. హఠాత్తుగా ఉద్యోగం పోవడం లేదా అనారోగ్య సమస్యలు రావడం వంటి అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బును పక్కన పెట్టాలి. మీ నెలవారీ ఖర్చులకు కనీసం 3 నుండి 6 రెట్లు సమానమైన మొత్తాన్ని ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతాలో ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో దాచుకోవడం ఉత్తమం.
కొత్తగా ఉద్యోగంలో చేరగానే బ్యాంకులు ఈజీగా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి. చేతిలో కార్డు ఉంది కదా అని అవసరానికి మించి షాపింగ్ చేసి, ఆ తర్వాత భారీ వడ్డీలతో కూడిన అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు. క్రెడిట్ కార్డును కేవలం అత్యవసర అవసరాలకు, బిల్లులు సకాలంలో చెల్లించగలిగే పరిమితి లోపు మాత్రమే వాడాలి.
డబ్బును కేవలం సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచితే దాని విలువ పెరగదు. చిన్న వయస్సు నుంచే మ్యూచువల్ ఫండ్స్ (SIP), పీపీఎఫ్ (PPF), లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. కాంపౌండింగ్ (చక్రవడ్డీ) పద్ధతి ద్వారా ఈ చిన్న పెట్టుబడులే భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని దాచుకోవడం, సరైన మార్గంలో ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రారంభం నుంచే ఈ అలవాట్లను పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..