
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే వాటి చుట్టూ ఎన్నో రకాల అపోహలు, భయాలు కూడా అల్లుకుని ఉన్నాయి. పండ్లు తింటే బరువు పెరుగుతారని, రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలు వస్తాయని, స్మూతీలు తాగితే ఫైబర్ నశిస్తుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. వీటన్నింటిపై ప్రముఖ డైటీషియన్ స్వీటీ రాణా, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజేష్ పూరి స్పందిస్తూ శాస్త్రీయ వివరణ ఇచ్చారు. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను పూర్తిగా దూరం పెట్టాల్సిన పనిలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు తక్కువ నుండి మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన బెర్రీలు, యాపిల్స్, పియర్స్, నారింజ, జామ, కివీ వంటి పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే పండ్ల రసాల కంటే గుజ్జుతో కూడిన పూర్తి పండును తినడం మంచిది. పండ్లలోని సహజ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. ఒకసారికి ఒక చిన్న పండు లేదా అర కప్పు నుండి ఒక కప్పు వరకు తరిగిన పండ్ల ముక్కలు తీసుకోవడం ఉత్తమమైన కొలత.
పండ్లలో ఉండే సహజమైన ఫ్రక్టోజ్ బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. జామ, యాపిల్స్, ఆరెంజ్, పుచ్చకాయ వంటి పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు త్వరగా నిండిన భావనను కలిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అయితే పండ్ల రసాలు, అధిక చక్కెర కలిపిన స్మూతీల వల్ల మాత్రమే అనవసర కేలరీలు శరీరంలోకి చేరతాయి. సమతుల్య ఆహారం తీసుకుంటూ, సరైన పరిమాణంలో పండ్లు తింటే బరువు పెరిగే అవకాశమే ఉండదు.
పండ్లను బ్లెండ్ చేసి స్మూతీలా చేసుకుంటే ఫైబర్ పోతుందనుకోవడం కూడా తప్పేనని వైద్యులు చెబుతున్నారు. స్మూతీలలో అదనంగా పంచదార, కృత్రిమ సిరప్‌లు కలపకుండా గింజలు, నట్స్, పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకుంటే పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అలాగే ఖాళీ కడుపుతో లేదా రాత్రిపూట పండ్లు తింటే జీర్ణక్రియ దెబ్బతింటుందనడానికి ఎటువంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. ప్యాక్ చేసిన చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన తీపి పదార్థాలే ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి తప్ప సహజమైన పండ్ల వల్ల ఎలాంటి ముప్పు ఉండదు.
పిల్లలు, వృద్ధులు, మహిళలకు కూడా పండ్లు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు రోజుకు ఒకటి లేదా రెండు పండ్లను అలవాటు చేయాలి. వృద్ధులు నమలలేకపోతే మెత్తగా చేసిన పండ్లను అందించవచ్చు. పీసీఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు, గర్భిణులకు పండ్లు అవసరమైన పోషకాలను అందిస్తాయి. వ్యాయామం చేసేవారు శక్తి కోసం పండ్లను తీసుకుంటూనే, వర్కవుట్ ముగిసిన తర్వాత ప్రోటీన్‌తో కలిపి తీసుకుంటే కండరాల రికవరీ వేగవంతమవుతుంది. ఉబ్బరం, ఐబీఎస్ సమస్యలు ఉన్నవారు కివీ, అరటి, పైనాపిల్ వంటి తక్కువ FODMAP పండ్లను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.