
వాము ఆకు మొక్క.. అనేక ఔషధ గుణాలున్న ఒక అద్భుతమైన మొక్క.. వామాకులు లేదా.. అజ్వైన్ లీఫ్ లేదా క్యారం లీఫ్ అని కూడా పిలుస్తారు.. సాధారణంగా భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా రసం రూపంలో దీనిని ఉపయోగిస్తారు. వాము ఆకు రసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం. సీజనల్ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, గొంతులో మంట, నొప్పి వంటి అనేక సమస్యలకు ఇది ఒక సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.
వాము ఆకులో కఫాన్ని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తగ్గించి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, గ్యాస్ సమస్యలు, అజీర్తి (ఇండైజెషన్) వంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులకు కూడా ఇది చాలా మంచిది. వాము ఆకును నీటిలో మరిగించి, వడపోసిన తర్వాత కొద్దిగా పంచదార కలిపి చిన్న పిల్లలకు ఇస్తే, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీనిని హోంమేడ్ గ్రేప్ వాటర్ లాగా పోల్చవచ్చు. ఈ ఆకుతో పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.
ఈ ఆరోగ్యకరమైన రసాన్ని తయారుచేయడానికి కొన్ని సులభమైన దశలు ఉన్నాయి.
ముందుగా, వాము ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక రోలు లేదా చిన్న మిక్సీ జార్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో రెండు చిన్న స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు, రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.
ఇవి వేగిన తర్వాత, ముక్కలుగా తరిగిన ఒక టమాటోను వేసి, ముప్పావు వంతు మగ్గే వరకు వేయించుకోవాలి.
టమాటోలు మగ్గిన తర్వాత, కట్ చేసి పెట్టుకున్న వాము ఆకులను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వాము ఆకు చాలా త్వరగా మగ్గుతుంది.
టమాటోలు, ఆకు మగ్గిన తర్వాత, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేసి, ఒక నిమిషం పాటు బాగా కలిపి ఫ్రై చేయాలి.
ఇప్పుడు, ముప్పావు లీటరు వరకు నీళ్లు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మీకు రసం ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీటి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత, పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.
పది నిమిషాలు మరిగించిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
రసం కొద్దిగా చల్లబడిన తర్వాత, పులుపు కోసం చింతపండుకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. చిన్న సైజు నిమ్మకాయలో సగం ముక్క రసం (సుమారు ఒక టీ స్పూన్) సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, ఆవిరి కొంచెం తగ్గిన తర్వాత నిమ్మరసం కలపడం మంచిది.
ఈ వాము ఆకు రసాన్ని అన్నంతో కలిపి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా, గొంతు నొప్పిగా అనిపించినప్పుడు, ఈ రసాన్ని అన్నంతో కలుపుకోకుండా వేడివేడిగా సూప్‌లా తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్తీ వాము ఆకు రసాన్ని ఒకసారి మీరు కూడా ప్రయత్నించి, దాని ప్రయోజనాలను పొందండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..