
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు, బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పవిత్రమైన పండుగను దాదాపు అందరూ ఘనంగా నిర్వహిస్తారు. అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడతారు. అయితే.. ఈ రాఖీ పౌర్ణమిని మరింత మధురంగా మార్చేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే ఒక అద్భుతమైన స్వీట్ రవ్వ బర్ఫీ.. ఈ వంటకం ఒక కప్పు బొంబాయి రవ్వతో సులభంగా, సరికొత్తగా తయారు చేయవచ్చు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఇంట్లో లభించే సామాగ్రితో తక్కువ సమయంలో నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
రవ్వ వేయించడం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో ఒక పావు కప్పు నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) వేసి, రంగు మారేవరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మీడియం మంటపై నిదానంగా కలుపుతూ వేయించండి. రవ్వ బాగా వేగిన తర్వాత, కావాలంటే రెండు స్పూన్ల గోధుమపిండి లేదా పాలపొడిని చేర్చి మరో రెండు నిమిషాలు వేయించి, పక్కన పెట్టుకోండి.
బెల్లం పాకం తయారీ: అదే పాన్‌లో ఒక కప్పు బెల్లం, అర కప్పు నీరు పోసి, బెల్లం పూర్తిగా కరిగేంతవరకు కలుపుతూ మరిగించండి. బెల్లం పూర్తిగా కరిగి లిక్విడ్‌గా మారిన తర్వాత, అందులో నలకలు, ఇసక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని శుభ్రమైన పాకాన్ని తీసుకోండి. పంచదార ఉపయోగిస్తే, పంచదార కరిగి లేత పాకం వస్తే సరిపోతుంది.
రవ్వ, బెల్లం పాకం కలపడం: వడకట్టుకున్న బెల్లం పాకాన్ని తిరిగి పాన్ లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించండి. రవ్వ అంతా బెల్లం పాకంలో బాగా కలిసేంతవరకు నిదానంగా కలుపుతూ ఉండాలి.
ఉడికించడం: ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేంతవరకు నెమ్మదిగా కలుపుతూ ఉడికించండి. రవ్వలోని నెయ్యి అంతా బయటికి వచ్చేంతవరకు, మిశ్రమం పాన్ నుండి సులభంగా విడిపోయేంతవరకు మీడియం మంటపై కలుపుతూ ఉండాలి.
రుచి మెరుగుపరచడం: స్వీట్ దగ్గర పడుతున్నప్పుడు, ఒక స్పూన్ యాలకుల పొడి, రెండు చిటికెల ఉప్పు వేసి బాగా కలపండి. ఉప్పు తీపిని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. స్వీట్ మిశ్రమం పూర్తిగా దగ్గరపడి, గట్టిగా మారేవరకు ఉడికించండి.
సెట్ చేయడం: స్వీట్ అంతా దగ్గరపడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక బౌల్‌కి లేదా ట్రేకి కొంచెం నెయ్యి అప్లై చేసి, అందులోకి మిశ్రమాన్ని షిఫ్ట్ చేయండి. ఈ సమయంలో డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా ముక్కలు) దానిపైన చల్లండి.. పూర్తిగా చల్లారేంతవరకు అలాగే పక్కన పెట్టేయాలి. చల్లారిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది.
పూర్తిగా చల్లారిన తర్వాత, ప్లేట్‌లోకి టర్న్ చేసుకుని, నచ్చిన షేప్‌లో పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేయండి. పెద్ద పీసెస్ కట్ చేస్తే స్టిక్కీగా లేకుండా సులభంగా వేరుపడతాయి. ఈ రవ్వ బర్ఫీని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు నుండి ఐదు రోజుల వరకు తాజాగా, రుచిగా ఉంటుంది.
ఈ రాఖీ పౌర్ణమికి ఇలాంటి సులభమైన, రుచికరమైన రవ్వ బర్ఫీని తయారు చేసి మీ ప్రియమైన వారికి అందించండి. ఇది ఎంతో టేస్టీగా ఉండి, పండుగ వాతావరణాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..