హల్వా అంటే చాలా మందికి ఇష్టం. చాలా రకాలుగా హల్వాను తయారు చేసుకోవచ్చు. హల్వా.. తియ్యగా, రుచిగా ఉంటుంది. ఏదన్నా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా అయిపోయే వాటిల్లో హల్వా కూడా ఒకటి. అంజీరాతో కూడా హల్వా తయారు చేసుకోవచ్చు. అంజీరా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడూ చేసుకునే హల్వాకు బదులు అంజీరాతో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ హల్వా తయారు చేసుకోవడానికి డ్రై అంజీరానే ఉపయోగించాలి. వీటితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంజీరా తినని వాళ్లు ఇలా హల్వా తయారు చేసుకుని తినవచ్చు. ఆరోగ్యానికి మంచిదే కాకుండా.. రుచి కూడా బాగుంటుంది. మరి అంజీరా హల్వా ఎలా తయారు చేసుకుంటారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్, కోవా, పంచదార లేదా పటిక బెల్లం పొడి లేదా బెల్లం పొడి, బాదం, జీడిపప్పు, నెయ్యి, కలర్ ఆప్షన్, యాలకుల పొడి.
ముందుగా అంజీరాలను కడిగి.. వేడి నీళ్లు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో చిన్న గిన్నెలోనే వేడి నీటిని వేసి బాదం పప్పును కూడా నానబెట్టుకోవాలి. బాదం పప్పు నానాక.. సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా అలాగే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అంజీరాలు మెత్తబడ్డాక ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్టులాగ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో మిక్సీ పట్టిన అంజీరా ముద్దను వేసుకోవాలి. ఇలా ఓ పది నిమిషాల పాటు అంజీరాను వేయించుకోవాలి.
అంజీరా ముద్దలాగా అయ్యాక ఇందులోనే పచ్చి కోవా వేసి ఓ ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మీ తీపిని బట్టి పంచదార లేదా పటిక బెల్లం పొడిని లేదా బెల్లం పొడిని అయినా వేసుకోవచ్చు. కలర్ కావాలి అనుకునేవారు కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టి ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇతర ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. అవసరం లేని వాళ్లు వదిలేయండి. చివరగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసి మళ్లీ మొత్తం కలపండి. అంతే ఎంతో రుచిగా ఉండే అంజీర్ హల్వా సిద్ధం.