లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ఎక్కువ వస్తుందో తెలుసుకోండి..

శాఖాహారుల నాన్‌వెజ్ పనీర్ వంటకాలంటే ఇష్టపడని వారుండరు. కానీ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న కల్తీ పనీర్ వార్తలు వింటుంటే బయట కొనాలంటేనే భయమేస్తోంది. అందుకే చాలామంది ఇప్పుడు ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక లీటరు పాలతో అస్సలు ఎంత పనీర్ వస్తుందో మీకు తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ఎక్కువ వస్తుందో తెలుసుకోండి..
How Much Paneer From 1 Litre Milk

Updated on: Jun 30, 2026 | 1:08 PM

పనీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రోటీన్లు పుష్కలంగా లభించే పనీర్‌కు వంటకాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పనీర్ బట్టర్ మసాలా, పనీర్ టిక్కా అనగానే నోరూరని వారుండరు. అయితే ఇటీవల మార్కెట్లో నకిలీ, కల్తీ పనీర్ విక్రయాలు ఎక్కువవుతుండటంతో చాలామంది బయట కొనడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారు ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఒక లీటరు పాలతో ఎంత పనీర్ తయారవుతుంది? ఏ పాలు వాడితే ఎక్కువ పనీర్ వస్తుంది? అనే విషయాలపై చాలా
మందికి రకరకాల డౌట్లు ఉంటాయి. వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పాలు రకాన్ని బట్టి పనీర్

లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందనేది మీరు తీసుకునే పాల రకం, నాణ్యత, అందులోని ఫ్యాట్ శాతంపై ఆధారపడి ఉంటుంది.

ఆవు పాలు: ఒకవేళ మీరు ఆవు పాలను ఉపయోగిస్తే.. లీటరు పాలకు సగటున 150 నుండి 200 గ్రాముల పనీర్ వస్తుంది.

బర్రె పాలు: బర్రె పాలలో కొవ్వు, ప్రోటీన్ శాతాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పాలతో లీటరుకు 200 నుండి 250 గ్రాములు, కొన్నిసార్లు పాల చిక్కదనాన్ని బట్టి 270 గ్రాముల వరకు ఎక్కువ పనీర్ లభిస్తుంది.

ప్యాకెట్ పాలు: మార్కెట్లో దొరికే ఫుల్ క్రీమ్ లేదా టోన్డ్ పాలతో సగటున 180 నుండి 220 గ్రాముల పనీర్ వస్తుంది.

4-5శాతం లేదా అంతకంటే ఎక్కువ కొవ్వు శాతం ఉన్న తాజా పాలతో ఎక్కువ మొత్తంలో, మెత్తటి పనీర్ తయారవుతుంది. చాలా రోజులు నిల్వ ఉంచే UHT పాలతో పనీర్ చేస్తే దిగుబడి చాలా తక్కువగా వస్తుంది.

ఇంట్లోనే సాఫ్ట్ పనీర్ తయారు చేసుకునే సింపుల్ ప్రాసెస్..

కల్తీ లేని స్వచ్ఛమైన పనీర్‌ను ఇంట్లోనే ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం:

పాలను మరిగించడం: మొదట ఒక లీటరు ఫుల్ క్రీమ్ పాలను గిన్నెలోకి తీసుకుని బాగా మరిగించాలి. పాలు మరింత చిక్కగా రావాలంటే మరిగేటప్పుడు కొద్దిగా మీగడ కూడా కలుపుకోవచ్చు.

పాలను విరగ్గొట్టడం

పాలు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి.. అందులో నిమ్మరసం లేదా వెనిగర్‌ను కొద్దికొద్దిగా పోస్తూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. దాంతో పాలు విరిగి, పనీర్ ముక్కలు, లేత పచ్చ రంగు నీరు వేరుపడతాయి. అలా నీరు వేరవగానే మంట ఆపేయాలి.

వడకట్టడం: ఇప్పుడు ఒక జల్లెడపై పలుచని కాటన్ వస్త్రాన్ని పరిచి, ఆ విరిగిన పాలను అందులో పోసి వడకట్టాలి.

పులుపు పోగొట్టడం: నిమ్మరసం లేదా వెనిగర్ వాడటం వల్ల పనీర్‌కు వచ్చే పులుపు వాసన పోవడానికి, వడకట్టిన పనీర్ ముక్కలను చల్లటి నీటితో ఒకసారి శుభ్రంగా కడగాలి.

షేప్ మార్చడం: ఆ తర్వాత వస్త్రాన్ని గట్టిగా మూటకట్టి, అందులోని అదనపు నీరంతా పోయేలా చూడాలి. ఆ మూటపై ఏదైనా బరువైన పాత్రను 20 నుండి 30 నిమిషాల పాటు ఉంచితే, పనీర్ చక్కటి ఆకారంలోకి మారుతుంది.

అంతే.. ఎంతో సాఫ్ట్ గా ఉండే హోమ్‌మేడ్ పనీర్ రెడీ.. దీన్ని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకుని వంటల్లో వాడుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టి భద్రపరుచుకోవచ్చు.

Follow Us