
భారతీయులకు టీ అనేది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. ఉదయాన్నే కప్పు టీ పడితేనే గానీ చాలామందికి రోజు మొదలవ్వదు. అయితే ఆరోగ్య స్పృహ పెరిగిన ఈ రోజుల్లో చాలామంది పాలు కలిపిన టీ కంటే అల్లం టీ లేదా లెమన్ టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్? ఏది ఎప్పుడు తాగాలో ఇప్పుడు చూద్దాం.
అల్లంలో ఉండే జింజెరాల్స్ అనే పదార్థం అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే కీళ్ల నొప్పులతో బాధపడేవారికి అల్లం టీ దివ్యౌషధం. ఇది వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు అల్లం టీ శరీరంలో వేడిని పుట్టించి తక్షణ ఉపశమనం ఇస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలు ఉన్నవారికి భోజనం తర్వాత లేదా ఉదయాన్నే అల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు లెమన్ టీని ఎంచుకోవడం ఉత్తమం. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. రోజంతా పని ఒత్తిడిలో ఉండేవారికి లెమన్ టీ వాసన మనసును ప్రశాంతపరుస్తుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. బాడీలోని విషతుల్యాలను బయటకు పంపడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
మీ శరీర అవసరాన్ని బట్టి టీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒళ్లు నొప్పులు, జలుబు లేదా అజీర్తిగా ఉంటే నిస్సందేహంగా అల్లం టీ తాగండి. అలసటగా ఉండి, ఫ్రెష్‌గా అనిపించాలన్నా.. బరువు తగ్గాలన్నా లెమన్ టీ వైపు వెళ్లండి.
చాలామంది టీని గంటల తరబడి మరిగిస్తారు. అలా చేయడం వల్ల అల్లం లేదా నిమ్మలోని ఔషధ గుణాలు నశిస్తాయి. నీరు బాగా మరిగిన తర్వాత అల్లం తురుము లేదా నిమ్మరసం వేసి, కేవలం 2 నిమిషాలు మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల పోషకాలు ఆవిరి కాకుండా టీలో కలిసి ఉంటాయి.