
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది.. షుగర్, అధిక బరువు సహా.. ఎన్నో సమస్యలు వెంటాడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి మేలు చేసే చిరుధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. అలాంటి చిరుధాన్యాలలో కొర్రలు (Foxtail Millets) ఒకటి.. ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉండే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇవి మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇచ్చి, రక్తహీనతను తగ్గిస్తాయి. డైటీషియన్ల ప్రకారం.. కొర్రలు, ఆంగ్లంలో ఫాక్స్‌టైల్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్ అని పిలిచే.. ఈ అద్భుతమైన సిరిధాన్యం.. దాని విశేషమైన పోషక విలువలతో ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. లేత పసుపు రంగులో ఉండే ఈ మిల్లెట్‌ను గుర్తించడం సులభం. దీనిలో దాదాపు 8% ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐదు సిరిధాన్యాలలో కొర్రలు అత్యంత సమతుల్యమైన పోషకాలను అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో కొర్రలు సహాయపడతాయి. ఫిట్స్ (ఎపిలెప్సీ), సయాటికా, వణుకు (ట్రమర్స్), నడకలో సమస్యలు వంటి వాటికి కొర్రలు ఆహారంలో భాగం చేయడం మంచిదని సూచించబడింది. పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ వంటి దీర్ఘకాలిక నరాల క్షీణత సంబంధిత వ్యాధులకు కూడా కొర్రలు ప్రయోజనకరంగా ఉంటాయి. సయాటికా గురించి మరింత వివరించాలంటే, వెన్నెముకలోని రెండు వెర్టిబ్రల్ ఎముకల మధ్య డిస్క్ స్పేస్ సన్నగా మారినప్పుడు నరాలు ఒత్తిడికి గురై నొప్పి కలుగుతుంది. దీనినే సయాటికా అంటారు. చిన్నపిల్లలలో తరచుగా కనిపించే బెడ్ వెట్టింగ్ సమస్యకు, అలాగే జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు వచ్చే ఫిట్స్‌కు కూడా కొర్రలను అధిక ప్రమాణంలో వాడాలని సూచిస్తారు.
కీళ్ల ఆరోగ్యానికి కూడా కొర్రలు ఎంతో మేలు చేస్తాయి. ఆస్టియోఆర్థరైటిస్, ఇతర అన్ని రకాల ఆర్థరైటిస్ సమస్యలు, కీళ్ల నొప్పి, వాపు వంటి వాటికి కొర్రలు సమర్థవంతమైన ఆహారంగా పరిగణిస్తారు. కొర్రలలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడవచ్చు.
అయితే, కేవలం కొర్రలను మాత్రమే కాకుండా, అన్ని సిరిధాన్యాలను సమతుల్య పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఒకే రకమైన మిల్లెట్‌ను మాత్రమే వాడటం అంత మంచిది కాదని, వారంలో వివిధ రకాల సిరిధాన్యాలను ప్లాన్ చేసుకోవడం వల్ల అన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తారు. తద్వారా, మీ ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా సరైన ఆహార ప్రణాళికను మీరే రూపొందించుకోవచ్చు. కొర్రలు ఒక అద్భుతమైన ఆహారంగా పరిగణించబడి, నరాలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.
కొర్రలను తీసుకోవడానికి.. ముందుగా 4-6 గంటల పాటు నానబెట్టి, ఆపై అన్నం, కిచిడీ, ఉప్మా లేదా పులిహోరలా వండుకోవచ్చు. బియ్యంలానే 1:3 నిష్పత్తిలో నీరు పోసి పొయ్యి మీద లేదా ప్రెషర్ కుక్కర్‌లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, కూరలు లేదా పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా అందుతాయని పేర్కొంటున్నారు. ముందుగా.. తాలింపు వేసి.. మసాలా, కారం ఉప్పు.. జోడించి.. కుక్కర్ లో ఉడికించాలి.. ఆ తర్వాత.. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.. కొర్రలను ఉదయాన్నే తీసుకుంటే మంచిది. ఇంకా కొర్రల జావ, కొర్రల ఇడ్లీ కూడా తయారు చేసుకోని తినవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..