
ప్రస్తుత విధానంలో పీఎఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్, కంపెనీ ఆమోదం వంటి ప్రక్రియల వల్ల డబ్బులు రావడానికి కనీసం 7 నుంచి 10 రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం డ్రా చేయాలంటే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. కానీ, కేంద్ర కార్మిక శాఖ రూపొందించిన ఈపీఎఫ్ 3.0 పూర్తిగా పేపర్‌లెస్ మరియు డిజిటల్ విధానం. ఇకపై డాక్యుమెంట్ సమస్యలు, క్లెయిమ్ రిజెక్షన్ల ఇబ్బందులు ఉండవు.
పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే భవిష్యత్తులో వచ్చే పెన్షన్ తగ్గిపోతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్రం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఈ ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయం కేవలం మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. మీ వాటా, యజమాని వాటా ఇందులో ఉంటాయి కానీ, పెన్షన్ డబ్బులు మాత్రం పూర్తిగా సురక్షితం. ఈపీఎఫ్ నుంచి డబ్బులు తీసుకున్నా మీ సర్వీస్ రికార్డులో ఎలాంటి మార్పు ఉండదు. పదేళ్ల సర్వీస్ పూర్తి కాగానే పెన్షన్ పొందడానికి మీరు అర్హులు.
అత్యవసర ఆరోగ్య అవసరాల కోసం లేదా ఇతర ఆర్థిక ఇబ్బందుల కోసం ఇకపై ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ సొమ్మును మీరు ఏ క్షణమైనా పొందేలా కేంద్రం కల్పించిన ఈ వెసులుబాటు, ఉద్యోగులకు గొప్ప ఊరటనిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణతో పాటు, క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే ఈ డిజిటల్ వ్యవస్థను ప్రతి ఉద్యోగి వినియోగించుకోవాలి. ఈపీఎఫ్ 3.0తో మీ ఆర్థిక ప్రయాణం మరింత సులభతరం కానుంది.