కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.. మీ లైఫ్‌ను కాపాడే టిప్స్ ఇవే..

కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? గాయానికి పసుపు, కారం లేదా నూనె రాస్తే సరిపోతుందా? కుక్కకు టీకాలు వేశారు కాబట్టి మనకు వ్యాక్సిన్ అవసరం లేదా? మీ మనస్సులో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉంటే.. మీరు ముమ్మాటికీ ప్రమాదంలో ఉన్నట్లే.. కుక్క కాటు విషయంలో చేసే చిన్న పొరపాటు లేదా ఆలస్యం ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.. మీ లైఫ్‌ను కాపాడే టిప్స్ ఇవే..
What To Do Immediately After A Dog Bite

Updated on: Jul 06, 2026 | 9:49 AM

ఇటీవలి కాలంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. అయితే చాలామంది కుక్క కాటును కేవలం ఒక శారీరక గాయంగానే భావిస్తారు. కానీ వైద్య పరిభాషలో దీనిని అత్యంత తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. కుక్క కాటు వల్ల సోకే రేబిస్ వ్యాధి ఎంత ప్రమాదకరమంటే.. ఒక్కసారి దీని లక్షణాలు బయటపడితే ఆ రోగి బ్రతికే అవకాశాలు దాదాపు శూన్యం. బెంగళూరు ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ అరవింద ఎస్ ఎన్ వివరణ ప్రకారం.. ‘‘రేబిస్ సోకిన తర్వాత మరణాన్ని నివారించాలంటే సకాలంలో యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవడం ఒక్కటే మార్గం. దీని ద్వారా రేబిస్‌ను 100 శాతం నివారించవచ్చు. గాయం తీవ్రతను బట్టి వైద్యులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు ఏఆర్‌ఎస్ లేదా రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లను ఇస్తారు. కాటు చిన్నదైనా, పెద్దదైనా వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి’’ అని వెల్లడించారు.

శరీరంలో వైరస్ ప్రయాణం ఎలా ఉంటుంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక నివేదిక ప్రకారం.. రేబిస్ అనేది జంతువుల నుండి మానవులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధి. కుక్క కరిచినప్పుడు దాని లాలాజలంలో ఉండే వైరస్ గాయం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ఇది నెమ్మదిగా నరాల ద్వారా ప్రయాణించి కేంద్ర నాడీ వ్యవస్థను చేరుకుంటుంది. రోగిలో నీటిని చూసి భయపడటం, గాలిని చూసి వణకడం, భ్రాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఒక్కసారి బయటపడ్డాయా.. ఇక 100శాతం కేసులలో మరణం సంభవిస్తుంది. అందుకే లక్షణాలు రాకముందే చికిత్స ముగించాలి.

తక్షణమే చేయాల్సిన ప్రథమ చికిత్స

కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రికి పరిగెత్తే లోపు ఇంట్లోనే చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఇవే..

15 నిమిషాల వాషింగ్: గాయాన్ని వెంటనే రన్నింగ్ వాటర్ కింద ఉంచి, సబ్బుతో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కడగాలి. దీనివల్ల లాలాజలంలోని వైరస్ లోపలికి వెళ్లకుండా చాలా వరకు కొట్టుకుపోతుంది.

యాంటీసెప్టిక్: కడిగిన తర్వాత ఇంట్లో ఉండే పోవిడోన్ అయోడిన్ లేదా ఆల్కహాల్ ఆధారిత యాంటిసెప్టిక్ లిక్విడ్‌ను గాయంపై రాయాలి.

కట్టు కట్టకూడదు: కుక్క కాటు గాయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా కట్టు లేదా బ్యాండేజీలు వేయకూడదు. గాయాన్ని తెరిచే ఉంచాలి. అలాగే గాయానికి మట్టి, కాఫీ పొడి, సున్నం లేదా నూనెలు రాయడం వంటి నాటు వైద్యాలు చేసి సమయాన్ని వృథా చేయకూడదు.

తప్పనిసరిగా పాటించాల్సిన 4 డోసుల వ్యాక్సిన్ షెడ్యూల్

కుక్క కరిచిన వారికి వైద్యులు పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ కింద 4 డోసుల వ్యాక్సిన్ షెడ్యూల్‌ను సూచిస్తారు. దీనిని కచ్చితంగా గడువు ప్రకారం వేయించుకోవాలి..

  • కుక్క కరిచిన రోజే మొదటి డోస్ తీసుకోవాలి.
  • 3వ రోజు: రెండవ డోస్.
  • 7వ రోజు: మూడవ డోస్.
  • 14వ రోజు: నాల్గవ డోస్.

చికిత్స సమయంలో ఆహార నియమాలు..

కుక్క కాటు చికిత్స తీసుకుంటున్నప్పుడు ప్రత్యేకమైన పత్యం ఏమీ లేనప్పటికీ, రోగనిరోధక శక్తి పెరగడానికి, గాయం త్వరగా మానడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం.

తినవలసినవి: కోడిగుడ్లు, పప్పులు, మొలకెత్తిన గింజలు వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం. అలాగే విటమిన్లు లభించే తాజా పండ్లు, ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవాలి.

దూరంగా ఉండవలసినవి: కారం, మసాలాలు, పచ్చళ్లు, నిల్వ ఉంచిన ప్యాక్డ్ ఫుడ్స్, ఆల్కహాల్‌కు చికిత్స పూర్తయ్యే వరకు దూరంగా ఉండటం చాలా మంచిది.

కుక్క కరిచినప్పుడు సదరు కుక్కను 10 రోజుల పాటు గమనించడం మంచిదే.. కానీ కుక్కను గమనించే నెపంతో వ్యాక్సినేషన్‌ను ఆలస్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా ప్రారంభిస్తే.. ప్రాణాంతక రేబిస్ మహమ్మారి నుండి అంత సురక్షితంగా బయటపడవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Follow Us