
పొడవైన, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రముఖ ఆయుర్వేద న్యూట్రిషనిస్ట్ ఒక ప్రత్యేకమైన హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారీ విధానాన్ని సూచించారు. నువ్వుల నూనెలో ఉసిరి పొడి, బ్రాహ్మి పొడి, భృంగరాజ్ పొడి, మందార పువ్వులు, మెంతులు, మిరియాలు, రోజ్మేరీ ఆకులు కలిపి తక్కువ మంటపై మరిగించి రాత్రంతా ఉంచి వడకట్టాలి. ఈ నూనెను వారానికి 2–3 సార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి, జుట్టు పొడవుగా పెరగడానికి తోడ్పడుతుంది. మరింత వివరంగా తెలియాలంటే..
నువ్వుల నూనె: 100 మి.లీ.
ఉసిరి పొడి: 1 టీస్పూన్
బ్రాహ్మి పొడి: 1 టీస్పూన్
భృంగరాజ్ పొడి: 1 టీస్పూన్
మందార పువ్వులు (తాజావి లేదా ఎండినవి): అర కప్పు
మెంతులు: 1 టీస్పూన్
మిరియాలు: 1 టీస్పూన్
రోజ్మేరీ ఆకులు: 1 టీస్పూన్
ఒక పాత్రలో 100 మి.లీ. నువ్వుల నూనె తీసుకుని అందులో ఉసిరి, బ్రాహ్మి, భృంగరాజ్ పొడులు వేయాలి. అనంతరం మందార పువ్వులు, మెంతులు, మిరియాలు, రోజ్మేరీ ఆకులు కూడా కలపాలి. ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి తక్కువ మంటపై 15 నుంచి 20 నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం వడకట్టి శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
వాడే పద్ధతి: ఈ నూనెను వారానికి 2 నుంచి 3 సార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల నుంచి గంట సేపు ఉంచిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
పోషక గుణాలు: ఉసిరిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కుదుళ్లకు బలాన్నిస్తాయి. బ్రాహ్మి, భృంగరాజ్ తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మందార పువ్వులు జుట్టును మృదువుగా ఉంచుతాయి. మెంతుల్లోని ప్రోటీన్ జుట్టుకు లోపలి నుంచి పోషణ అందిస్తుంది. రోజ్మేరీ ఆకులు రక్త ప్రసరణను మెరుగుపరచి చుండ్రును తగ్గించడంలో, జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.
ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేరుగా ఉంటుంది కాబట్టి ఈ నూనెను తలకు రాసే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.