
బయటి ఫాస్ట్ ఫుడ్స్, హోటల్ భోజనం కంటే ఇంట్లో వండిన తాజా ఆహారమే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరూ భావిస్తారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమే అయినా.. వంటగదిలో మనం తెలియకుండా చేసే కొన్ని చిన్నచిన్న అలవాట్లు ఆ ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయని మీకు తెలుసా? వంట చేసే సమయంలో శుభ్రత లోపిస్తే బ్యాక్టీరియా ఆహారంలోకి చేరి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. వంటింట్లో మనం అస్సలు చేయకూడని ఆ కీలక పొరపాట్లు, వాటిని నివారించే మార్గాలేంటో తెలుసుకోవడం ముఖ్యం.
చాలా ఇళ్లలో కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ లేదా చేపలు కోయడానికి ఒకే కత్తిని, ఒకే చాపింగ్ బోర్డును వాడుతుంటారు. నిపుణుల ప్రకారం.. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. దీనిని క్రాస్ కంటామినేషన్ అంటారు. పచ్చి మాంసంలో ఉండే సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా కత్తి లేదా బోర్డు ద్వారా కూరగాయలు, పండ్లకు వ్యాపిస్తుంది. కూరగాయలను సలాడ్ రూపంలో పచ్చిగా తిన్నప్పుడు లేదా తక్కువగా ఉడికించినప్పుడు ఈ బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి చేరి తీవ్ర అస్వస్థతకు గురిచేస్తుంది. అందుకే శాకాహారం, మాంసాహారానికి వేర్వేరు కత్తులు, బోర్డులు వాడటం తప్పనిసరి. వాడిన వెంటనే వాటిని సబ్బు నీటితో శుభ్రం చేయాలి.
వంట మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. చాలామంది నేరుగా కూరగాయలు తరగడం, పిండి కలపడం వంటి పనులు చేస్తుంటారు. రోజువారీ పనుల వల్ల చేతులకు అంటే మురికి, క్రిములు నేరుగా ఆహారంలో కలుస్తాయి. ముఖ్యంగా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత పచ్చి మాంసం లేదా కోడిగుడ్లను తాకిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతుల మీదున్న సూక్ష్మజీవులు కుటుంబ సభ్యులందరి కడుపులోకి చేరుతాయి.
ఆహారం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెడతాం. కానీ పచ్చి చికెన్, చేపలను.. పండ్లు, పాలు లేదా వండిన ఆహార పదార్థాల పక్కనే ఉంచడం పెద్ద తప్పు. పచ్చి మాంసంలో నుంచి కారే నీరు లేదా వాటి నుంచి వెలువడే తేమ ఇతర వస్తువులపై పడితే బ్యాక్టీరియా సులభంగా వ్యాపిస్తుంది. మాంసాహారాన్ని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలలో పెట్టి ఫ్రిజ్ అడుగు భాగంలో భద్రపరచాలి. తద్వారా దాని రసాలు ఇతర ఆహారాలపై పడే ప్రమాదం ఉండదు.
స్టవ్, కిచెన్ ప్లాట్‌ఫామ్, పాత్రలు తుడవడానికి ఒకే గుడ్డను వాడటం, అదే గుడ్డతో చేతులు తుడుచుకోవడం వంటగదిలో ఎక్కువగా కనిపించే మరో పొరపాటు. తడి స్పాంజ్‌లు, మురికి గుడ్డలు బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనువైన ఆవాసాలు. వాటిని వాడినప్పుడు క్రిములు వంటిల్లంతా వ్యాపిస్తాయి. తుడిచే గుడ్డలను ఎప్పటికప్పుడు వేడి నీటితో లేదా డిటర్జెంట్‌తో ఉతికి ఎండలో ఆరబెట్టాలి. తేమగా ఉండే స్పాంజ్‌లను ప్లాట్‌ఫామ్‌పై ఉంచకూడదు.
కూరగాయలు, పండ్లు బయటకు మెరుస్తూ కనిపించినప్పటికీ వాటిపై పురుగుమందుల అవశేషాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని కోయకముందే పారే నీటి కింద రుద్ది కడగాలి. కోసిన తర్వాత కడిగితే వాటిలోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ఆహారాన్ని సరిగ్గా ఉడికించడం. ఆదరాబాదరాగా వంట చేసి మాంసం, చికెన్ లేదా గుడ్లను సగం ఉడికిన స్థితిలోనే దించేస్తే, వాటిలోని ప్రమాదకర బ్యాక్టీరియా నశించదు. పూర్తి స్థాయిలో సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడే ఆహారం సురక్షితంగా మారుతుంది. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు.