నెలరోజుల బాలింత… కరోనాపై పోరులో వెరవని వనిత

నెలరోజుల బాలింత... కరోనాపై పోరులో వెరవని వనిత

ఆమె ఓ విమెన్ ఆఫీసర్. నెల రోజుల క్రితమే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె కావాలనుకుంటే దాదాపు 9 నెలల పాటు మెటర్నిటీ లీవులు తీసుకుని... ఇంటి పట్టునే వుంటూ బిడ్డ ఆలనాపాలనా చూసుకునే వెసులుబాటు వుంది. కానీ దేశం ఇపుడు కరోనాపై యుద్దం చేస్తున్న సంగతి ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. మాతృత్వపు సెలవులు రద్దు చేసుకుని మరీ విధినిర్వహణలో చేరిపోయారు.

Rajesh Sharma

|

Apr 10, 2020 | 6:28 PM

విశాఖ మహానగరంపై కరోనా మహమ్మారి కోరలు చాచింది. అంతకంతకూ విస్తరిస్తూ నాయకులకు అధికారులకు సవాల్‌ విసురుతోంది. దీంతో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు విశాఖ వాసులు. అయితే ప్రజలను, అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని సైనికుల్లా ముందుండి నడిపించేందుకు ఒక బాలింత రంగంలోకి దిగారు. ఈమె పేరు సృజన.

జీవీఎమ్‌సీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే కరోనా రక్కసి వేగంగా వ్యాపిస్తుండటంతో తన మెటర్నిటీ లీవులను సైతం రద్దు చేసుకున్నారామె! బిడ్డ ఆలనాపాలనా చూసుకునే బాధ్యత ఉన్నా విపత్కర పరిస్థితులలో ప్రజలను కాపాడే బాధ్యత కూడా తనపై ఉందని గుర్తించారు. వెంటనే విధుల్లో చేరిపోయారు.

గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన సృజన తర్వాత జీవీఎమ్‌సీ కమిషనర్‌గా పదవీబాధ్యతలను చేపట్టారు. కరోనా కమ్మేస్తుండటంతో ఇంట్లో ఉండలేక ప్రజాసేవకే మొగ్గుచూపారు. బిడ్డ బాగోగులను భర్తకు, తల్లికి అప్పగించి ఆఫీసుకు వెళుతున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాను తరిమేందుకు జరుగుతున్న పోరాటంలో నేను సైతం అంటున్నారు.

నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు చేయడం, ప్రజలకు సహాయక చర్యలు, నైట్‌ షెల్టర్లు నిర్వహణ వంటి వాటిల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓవైపు చంటిబిడ్డను చూసుకుంటూనే మరోవైపు కరోనాను తరిమేందుకు శ్రమిస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ఆఖరికి ప్రజాప్రతినిధులు సైతం సృజన సేవలను గుర్తించి అభినందిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu