వలస కార్మికుల తరలింపు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 4:24 PM

దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని..

వలస కార్మికుల తరలింపు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది.  వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్నలను వేసింది.లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రధానంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్, ఫుడ్, వారి ట్రాన్స్ పోర్టేషన్ తదితరాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యం కాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. కాగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మే 1 న శ్రామిక్ రైళ్లను ప్రారంభించినప్పటి నుచి ఇప్పటివరకు 91 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడించారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతించరాదని, అలాంటి వారు కావాలంటే  అఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు.

వలస జీవులకు రైల్వే శాఖ 84 లక్షల ఆహార పాకెట్లను అందించిందని తుషార్ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుందన్నారు. తమ వాదనలను కోర్టు శ్రధ్ధగా ఆలకించిందని, పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని తుషార్ మెహతా ఆ తరువాత తెలిపారు. కాగా-తమ పేర్ల నమోదులోను, టికెటింగ్ సిస్టం లోను జాప్యం జరుగుతుండడంతో.. ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు కాలినడకనే సాగుతున్నారు.