Traffic Violation Act: భాగ్యనగరంలో ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసిన కూడా వాహనదారులు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఇకపై ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించాలని భావిస్తున్నారు. వీలయితే జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానాలు కూడా వేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానమైన సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలీసులు నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇకపోతే గత నెలలో సుమారు 80 శాతం బైకర్లు మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా.. కారులో వెళ్లే డ్రైవర్లు 40 శాతం మంది నడుపుతూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు.
మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారిలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. ముంబై ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 39,160 కేసులు నమోదయ్యాయి.