
seoul to ban gatherings: ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ కలకలంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా క్రిస్ట్‌మస్, న్యూ ఇయర్ సెలవులు దగ్గర పడటంతో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దక్షిణ కొరియాలో ఒకేరోజు భారీ స్థాయిలో కరోనా మరణాల సంఖ్య నమోదు కావడంతో ఆదేశ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో సెలవుల కారణంగా రాజధానిలో మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నలుగురి కంటే ఎక్కువ మంది జనం గుమిగూడకూడదంటూ ఆంక్షలను విధించింది. కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి తీసుకొస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆంక్షలు ఇండోర్, ఔట్‌డోర్ ఫంక్షన్లలోనూ అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అంత్యక్రియలు, పెళ్లిళ్లకు మాత్రం ఆంక్షల నుంచి సడలింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు మొత్తం 50,591 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 698 మంది మృత్యువాతపడ్డారు.