Meet The Nano Chameleon: ప్రకృతిలో ఎన్నో వింతలు విడ్డూరాలు.. అతి చిన్న లేదా పెద్ద జీవులైనా… వస్తువైనా మనుషుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. వాటికి ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న ఉసరవెల్లి పరిశోధకుల కంటిలో పడింది. రంగుల మార్చే ఈ జీవి మడగాస్కర్ లో వెలుగులోకి వచ్చింది. దీనిని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. మగ ఊసరవెల్లిగా గుర్తించింది. అంతేకాదు దీనికి బ్రూకీసియా నానాగా కూడా నామకరణం చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ గుర్తించిన 51 ఇతర రకాల ఊసరవెల్లులతో పోలిస్తే ఇదే అత్యంత చిన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతేకాదు.. చాలా చిన్నగా ఉన్న ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందింది. ఊసరవెల్లి ముక్కు నుంచి చివరి వరకు అర అంగుళం అంటే 13.5 మిల్లీమీటర్ మాత్రమే ఉందని చెప్పారు. ఈ ఊసరవెల్లిని మన వేలికొనమీద నిలబెట్టుకున్నా పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మలా కనిపిస్తోంది. ముక్కు నుంచి తోకతో కలిపి కొలిస్తే ఇది కేవలం 22 మిల్లీమీటరు ఉందని తెలిపారు శాస్త్రజ్ఞులు. అయితే ఈ జాతిలోని మగ ఉసరవెల్లి కంటే ఆడ ఊసరవెల్లి పొడవుగా ఉందని.. దాని పొడవు 29 ఎంఎంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రో సిటీ స్కాన్స్, త్రీడైమెన్షనల్ ఎక్స్‌రేస్ సాయంతో ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు గుర్తించమని ప్రకటించారు.
మడగాస్కర్ అరుదైన ప్రాణులకు ఆవాసమని, ఇప్పటిదాక ఈ ప్రాంతంలో 200కు పైగా జాతులను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతో బుజ్జిగా బొమ్మలా ఉన్న ఈ బుల్లి ఊసరవెల్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.
Also Read: దేశంలో పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో ఎంతమంది కోలుకున్నారంటే..?