కాకినాడలో జనసేన గర్జన.. దీక్షకు పవన్ రెడీ

రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ దీక్షలో పాల్గొంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.. దానికి అనుగుణంగా దీక్ష సభా […]

కాకినాడలో జనసేన గర్జన.. దీక్షకు పవన్ రెడీ
Rajesh Sharma

|

Dec 11, 2019 | 6:42 PM

రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ దీక్షలో పాల్గొంటారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.. దానికి అనుగుణంగా దీక్ష సభా స్థలం ఏర్పాట్లు చేసారు.

ఖరీఫ్ సీజన్‌కు గాను గత ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో 312 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 96 వేల 464 మంది రైతుల నుంచి సుమారు 11 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అందుకు గాను రైతులకు 1979 కోట్ల రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. అప్పట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వానికి 15 నుండి 30 రోజుల సమయం పట్టేది. ఈ నేపధ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ దృష్టికి ఈ సమస్యను రైతులు తీసుకెళ్ళారు. దీంతో తాము అధికారంలోనికి వస్తే ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో రైతులకు డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించడంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సకాలంలో డబ్బులు అందుతాయని రైతులు ఆశించారు.

అక్టోబరులో కొనుగోలు చేసిన ధాన్యానికి డిసెంబర్ 4వ తేదీ వరకు చెల్లింపులు జరపలేదు. ధాన్యం ప్రభుత్వానికి అప్పజెప్పి 45 రోజులు దాటడం, దీనికి తోడు రబీ సీజన్‌కు నాట్లు వేయడానికి పెట్టుబడి కూడా చేతిలో లేకపోవడంతో కొంతమంది రైతులు తమ సమస్యను స్థానిక జనసేన నాయకుల ద్వారా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారు. ఉభయగోదావరి జిల్లాలో ఉండే అగ్రవర్ణ రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం, 45 రోజులు దాటుతున్నా ధాన్యం సొమ్ము చెల్లించకపోవడంతో పాటు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించినా కేవలం లక్షా 55 వేల 385 మెట్రిక్ టన్నులు మాత్రమే అధికారులు లెక్కలు చూపించడంపై కొంతమంది రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తూ రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారు.

రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి పొలాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతు భరోసా విషయంలో అగ్రవర్ణ రైతులకు జరుగుతున్న అన్యాయం, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల అవకతవకలు, చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం మండపేటలో నిర్వహించిన రైతు సదస్సులో రైతుల సమస్యపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వానికి మూడు రోజుల డెడ్ లైన్ విధించారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన మూడు రోజుల్లో రైతుల సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో కాకినాడ వేదికగా నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు.. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం కాకినాడ వేదికగా నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రైతులతో మాట్లాడి వారి సమస్యలపై మరింత లోతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.. దీంతో రైతు సౌభాగ్య దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లా జనసేన నాయకులు కసరత్తు చేస్తున్నారు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu