India Vs Australia 2020: అడిలైడ్ పరాభవాన్ని మర్చిపోయేలా రెండో టెస్టులో అద్భుతంగా రాణించాలని టీమిండియా బ్యాట్స్‌మెన్ తహతహలాడుతున్నారు. సిరీస్‌లో నిలవాలంటే బాక్సింగ్ డే టెస్టును భారత్ తప్పనిసరిగా గెలవాలి. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడంతో.. పేసర్ షమీకి గాయం కావడం.. బ్యాట్స్‌మెన్‌లో నిలకడలేమి.. ఇలా ఎన్నో సమస్యలతో టీమిండియా సతమతమవుతోంది. ఈ తరుణంలోనే రెండో టెస్టుకు నాలుగు మార్పులు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. అలాగే పేసర్ షమీ స్థానంలో యార్కర్ కింగ్ నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలు, టీ20ల్లో అదరగొట్టిన నటరాజన్.. టెస్టుల్లో కూడా దుమ్ములేపుతాడని జట్టు యాజమాన్యం అనుకుంటోంది.
వాస్తవానికి వన్డేలు అనంతరం నటరాజన్ స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే అతడ్ని నెట్ బౌలర్‌గా బీసీసీఐ ఆస్ట్రేలియాలోనే టీమ్‌తో ఉంచింది. ఇతర ప్లేయర్లకు గాయాలు కావడంతోనే వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేసిన నటరాజన్.. ఇప్పుడు అదే విధంగా టెస్టుల్లోనూ డెబ్యూ చేయనున్నాడని సమాచారం. అయితే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ బలంగా ఉండేందుకు నవదీప్ సైనీ జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు. మరి ఎవరు తుది జట్టులో చోటు సంపాదిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.!